
Fake Babas: గుప్త నిధుల పేరుతో ప్రజలు ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని దొంగ బాబాలు అందినకాడికి దోచుకుంటూనే ఉన్నారు. తాజాగా గుప్త నిధుల పేరుతో ఓ కుటుంబాన్ని మోసం చేసేందుకు ప్రయత్నించిన దొంగబాబాల ఆటకట్టించారు కరీంనగర్ పోలీసులు.
ఇంటి పక్కనే క్వింటాల్ బంగారం!
కరీనగర్ సమీపంలో శ్రీరాములపల్లెకు చెందిన జి ప్రవీణ్ అనే వ్యక్తికి గత కొంతకాలంగా ఆరోగ్యం బాగో లేదు. కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఓ స్వామి దగ్గరికి వెళ్లాడు. ఆయన మరికొంత మంది స్వాములతో కలిసి పెద్ద స్కెచ్ వేశాడు. మీ ఇంటి పక్కనే క్వింటాల్ బంగారం ఉందని, దానిని బయటకు తీసి పూజలు చేస్తే, కుటుంబం సంతోషంగా ఉంటుందని చెప్పారు. లేదంటే, ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని భయపెట్టారు. తన కుటుంబాన్ని కాపాడాలంటూ దొంగస్వాములను వేడుకున్నాడు ప్రవీణ్. పూజలకు కావాల్సిన సామన్లు కొనుగోలు చేయాలంటూ ఏకంగా రూ. 15 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఇంటి పక్కనే ఓ గొయ్యి తవ్వి కుంకుమ పసుపు చల్లి అందులో ముందుగా ఏర్పాటు చేసిన ఓ బాక్స్ ను బయటకు తీశారు. అందులోనే బంగారం ఉందని చెప్పారు. అయితే, దానిలోని బంగారం బయటకు తీసేందుకు మరికొంత డబ్బు కావాలన్నారు.
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
దొంగ బాబాల తీరుపై బాధితుడికి అనుమానం కలిగింది. డబ్బులు లాగేందుకు ఏదో ప్లాన్ చేస్తున్నారని భావించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈన్నాల రాజు, మిర్యాల దుర్గయ్య, పెనుగొండ రాజు, చల్ల అజయ్, ఈర్నాల సతీష్ అనే దొంగ బాబాలు, వారి అనుచరులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 15.30 లక్షల నగదు, 7 తులాల బంగారం, మూడు కార్లు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ ఏసీపీ శుభం ప్రకాష్ వెల్లడించారు.
Read Also: ఏకంగా నకిలీ పోలీస్ స్టేషనే ఏర్పాటు, వీళ్లు మామూలోళ్లు కాదురా అయ్యా!