ఆంధ్ర ప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

అన్నా వర్సెస్‌ చెల్లి – తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయం – ముద్రగడ ఫ్యామిలీలోనూ వార్‌

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో : అన్నాచెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరు. తెలుగు రాష్ట్రాల్లో ఇదే రాజకీయం జరుగుతోంది. ఒకరిని చూసి మరొకరు అన్నట్టు… తెరపైకి వస్తున్నారు. 2024 ఎన్నికల ముందు జగన్‌ వర్సెస్‌ షర్మిల… పొలిటికల్‌ ఫైట్‌ జరిగింది. ఆ సెగ.. తెలంగాణనూ తాకి… కేసీఆర్‌ ఇంట్లో భగ్గుమంది. కేటీఆర్‌పై విమర్శలతో కత్తిదూశారు చెల్లెలు కవిత. ఇప్పుడు.. ఇదే లొల్లి ముద్రగడ ఇంట్లోనూ మొదలైంది.

ముద్రగడ పద్మనాభం కుటుంబంలోనూ అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ముద్రగడ కుమారుడు గిరి, కుమార్తె క్రాంతి మధ్య ఆధిపత్య పోరు మొదలైనట్టు కనిపిస్తోంది. అందుకు కాంత్రి చేసిన కామెంట్సే నిదర్శనం. తండ్రి ముద్రగడ ఆరోగ్యం బాగోలేదని.. ఆయన క్యాన్సర్‌ బారిన పడ్డారని… తండ్రిని కలుద్దామంటే అన్న గిరి అడ్డుపడుతున్నాడని క్రాంతి ఆరోపించారు. అంతేకాదు… తన తండ్రిని ఒక గదిలో బంధించి.. తమను దగ్గరకు రానివ్వడం లేదంటూ లేఖ రాశారామె. దీంతో… ముద్రగడ ఫ్యామిలీలో పోరు బయటపడింది.


Read Also : ఏపీలో సరికొత్త పథకం – పిల్లల చదువుల కోసం డ్వాక్రా నుంచి లోన్‌..!


2024 అసెంబ్లీ ఎన్నికల ముందు ముద్రగడ పద్మనాభం.. వైసీపీలో చేరారు. చంద్రబాబుతో కలిసి కాపులకు ద్రోహం చేశారంటూ… పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ గెలిస్తే.. పేరు కూడా మార్చుకుంటున్నానన్నారు. అన్నట్టుగానే… ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు ఆయన. ఇదిలా ఉంటే… తండ్రి, సోదరుడు వైసీపీలో చేరితే.. కూతురు క్రాంతి మాత్రం వారికి విరుద్దంగా జనసేనలో చేరారు. అంతేకాదు… తండ్రి, సోదరుడిపై విమర్శలు కూడా చేశారామె. అప్పటి నుంచి ముద్రగడ కుటుంబంలో విభేదాలు నడుస్తున్నాయి.

ఇప్పుడు… సోదరుడు గిరికి వ్యతిరేకంగా ఆమె రాసిన లేఖ సంచలనం రేపుతోంది. అనారోగ్యంతో ఉన్న తండ్రిని కలిసేందుకు కూడా సోదరుడు అనుమతి ఇవ్వడంలేదని ఆమె ఆరోపిస్తున్నారు. గిరితోపాటు ఆయన భార్య తరపు బంధువులు తన తండ్రిని బంధించి ఉంచారని ఆమె లేఖలో పేర్కొన్నారు. ముద్రగడ కుటుంబంలో ఇలా విభేదాలు రావడంతో… ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

Back to top button