
Sri Lanka: శ్రీలంక ప్రస్తుతం తీవ్రమైన ప్రకృతి విపత్తుతో పోరాడుతోంది. దేశవ్యాప్తంగా కురుస్తున్న అతి భారీ వర్షాలు అక్కడి ప్రజల జీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా పడుతున్న మోస్తరు నుంచి భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహించడం ప్రారంభించాయి. నీటి మట్టం వేగంగా పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదలు రోడ్లను, వంతెనలను, కాలనీలను నీటిలో ముంచేసి ప్రజలను భారీగా ఇబ్బందులకు గురిచేశాయి.
కొండచరియలు విరిగిపడటం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం విడుదల చేసిన ప్రాథమిక నివేదికల ప్రకారం ఇప్పటివరకు 56 మంది వరదలు, కొండచరియల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాలు గృహలు కోల్పోయాయి. నీటి ప్రవాహం తీవ్రంగా పెరగడంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి, మరికొన్ని ఇళ్లు బలంగా దెబ్బతిన్నాయి. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 600కు పైగా ఇళ్లు నష్టపోయాయి.
రాజధాని కొలంబోకు తూర్పున సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బదుల్లా, సువారా ఎలియా ప్రాంతాలు ఈ విపత్తుతో అత్యంత ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఇవి ప్రధానంగా తేయాకు సాగుకు ప్రసిద్ధి అయిన పర్వత ప్రాంతాలు. ఇక్కడ భారీ వర్షాలకు తోడు కొండచరియలు వరుసగా విరిగిపడటంతో కనీసం 25 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 21 మంది గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. గల్లంతైన వారికోసం అత్యవసర రక్షణ బృందాలు తీవ్రంగా వెతుకుతున్నాయి. ఇప్పటివరకు 14 మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
వర్షాలతో రహదారులు దెబ్బతిన్న కారణంగా రక్షణ చర్యలు కూడా ఆలస్యమవుతున్నాయి. ప్రమాద ప్రాంతాలకు చేరడానికి సైన్యం, నేవీ, పోలీసు విపత్తు నిర్వహణ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఇంకా వర్షాలు తగ్గే సూచనలు లేకపోవడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలను ప్రకటించింది. ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నీటిముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ వరదల కారణంగా శ్రీలంకలో వ్యవసాయం, రవాణా, విద్యుత్ సరఫరా వ్యవస్థలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విపత్తు నుంచి బయటపడేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు, సైన్యం కలిసి పని చేస్తూ ప్రజలకు సహాయం అందిస్తున్నాయి.
ALSO READ: హైదరాబాద్ మెట్రో @ 8





