ఆంధ్ర ప్రదేశ్

కృష్ణమ్మ పరవళ్లు.. తెరుచుకున్న శ్రీశైలం గేట్లు!

Srisailam Dam Gates Open: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు రెండు గేట్లను 10 అడుగులు ఎత్తి స్పిల్ వే ద్వారా 55, 048 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అటు కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మరో 66,948 క్యూసెక్కులను అదనంగా సాగర్‌ కు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 39,168, సుంకేసుల జలాశయం నుంచి 36,975 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 883.80 అడుగులు ఉండగా.. నీటి నిల్వ 208 టీఎంసీలుగా నమోదైంది.

నాగార్జున సాగర్ ఎంత నిండిందంటే?

ప్రస్తుతం నాగార్జునసాగర్ లోకి లక్షా 22 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుంది. ఔట్ ఫ్లో 4835 క్యూసెక్కులగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 572.30 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుత సామర్ధ్యం 262 టీఎంసీలు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. సాగర్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో త్వరలో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం కనిపిస్తోంది.

సాగర్ కుడికాల్వకు నీటి విడుదల

అటు ఇప్పటికే తాగు, సాగు నీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయగా, తాజాగా సాగర్‌ కుడి కాల్వ ఆయకట్టుకు ఏపీ అధికారులు నీటిని విడుదల చేశారు. సాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని కుడి కాల్వ ఆయకట్టుకు ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. కుడి కాలువ పరిధిలో 11.50లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ కృష్ణమూర్తి వెల్లడించారు.  ప్రస్తుతం  గంటకు 500 క్యూసెక్కుల నుంచి 3000 క్యూసెక్కులు వరకు పెంచుతూ నీటిని విడుదల చేస్తామని ఎస్‌ఈ చెప్పారు.

Read Also: మరో రెండు రోజులు భారీ వర్షాలు, హైదరాబాద్ కు రెడ్ అలర్ట్!

Back to top button