తెలంగాణ

గాడినపడని కాంగ్రెస్ పాలన – 18 నెలల తరువాతా ప్రజల్లో నిరాశ

హైదరాబాద్‌, మే 27 (క్రైమ్ మిర్రర్‌): తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా, పాలన గాడిన పడలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రజాపాలనపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడుతూ ఉండటంతో పరిపాలన వ్యవస్థ మరింత సంక్లిష్టంగా మారింది. మంత్రుల కేటాయింపులు లేకుండా శాఖలు సక్రమంగా పని చేయలేకపోతున్నాయని తెలుస్తోంది. దీనితో పాటు, వరుసగా 44 సార్లు ఢిల్లీకి పర్యటనలు చేసిన సీఎం రేవంత్ స్థానిక పరిపాలనను నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది.

ఇదే సమయంలో ప్రజలకు హామీగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో అమలవకుండా ఉన్నాయని ప్రజలు నిలదీస్తున్నారు. మరోవైపు, పీసీసీ కమిటీల నియామకాలపై రేవంత్ దృష్టి సారించడంతో, కాంగ్రెస్ క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. “పాలన కంటే పదవులే ముఖ్యం” అనే వాదనకు బలమవుతోంది.

ఇటీవల రేవంత్‌ తనకు అనుకూల నేతలకు పదవులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు పార్టీ నేతల నుంచే రావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాతావరణం ఏర్పడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Back to top button