జాతీయంలైఫ్ స్టైల్

Flu Season: అసలే చలికాలం.. ఫ్లూ వచ్చే అవకాశం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి మరి..

Flu Season: చల్లని శీతాకాలంలో వాతావరణం మారుతుండగా చాలా మంది దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

Flu Season: చల్లని శీతాకాలంలో వాతావరణం మారుతుండగా చాలా మంది దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఫ్లూ లేదా ఇన్‌ఫ్లుయెంజా అనేది వైరస్ కారణంగా వచ్చే అంటువ్యాధి. ఇది ముఖ్యంగా ముక్కు, గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. పెద్దలు కొంతవరకు తట్టుకొనే శక్తి కలిగి ఉన్నా, చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఫ్లూ లక్షణాలు పెరిగే సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరగడం, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బంది, అలసట వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ఫ్లూ నుంచి ఉపశమనం పొందడానికి సులభమైన గృహ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. వాటిలో ముఖ్యమైనది గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి రోజుకు మూడుసార్లు పుక్కిలించడం. ఈ పద్ధతి గొంతులో ఉండే వైరస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గొంతు మండడం, నలత, ఛాతిలో పట్టేయడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. గరగరా పుక్కిలించడం వల్ల గొంతు శుభ్రపడటంతో పాటు శ్వాసనాళాల్లోని ఇన్‌ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది.

ఇంకా ఉపశమనానికి సహాయపడే మరో పద్ధతి ఎసెన్షియల్ ఆయిల్స్‌ను ఉపయోగించడం. దాల్చిన చెక్క, పుదీనా, నిమ్మ, యూకలిప్టస్ వంటి నూనెలను ఛాతి, గొంతు ప్రాంతంలో మర్దనా చేస్తే శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ నూనెల్లో ఉన్న సహజ యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసనాళాలను శుభ్రం చేసి గాలి ప్రవాహం మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా యూకలిప్టస్ ఆయిల్ ఫ్లూ సమయంలో ఉపయోగిస్తే మ్యూకస్ తగ్గి శ్వాస సులభమవుతుంది.

రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కూడా ఎంతో అవసరం. శరీరానికి కావలసిన పోషకాలు అందితే వైరస్‌ను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జింక్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. చేపలు, మాంసం, పప్పులు, బీన్స్, సీడ్స్, కోడిగుడ్లు వంటి ఆహారాలు శరీరంలోని తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. ఇవే వైరస్‌పై పోరాడే ప్రధాన రక్షకాలు. సరైన కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు శరీరానికి అందితే ఫ్లూ నుంచి కోలుకోవడం వేగవంతమవుతుంది.

సీజనల్ ఫ్లూ ఎక్కువగా ఉన్న సమయంలో శుభ్రత, సరైన ఆహారం, నీటి శాతం, విశ్రాంతి వంటి అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే ఫ్లూ నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు పునరావృతం కాకుండా నివారించవచ్చు.

ALSO READ: Women Education: అవునా..? నిజమా?.. ఆ అమ్మాయిలు 40 ఏండ్లు దాటినా పెళ్లి చేసుకోవట్లేదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button