టర్కీలోని అంకారాలో ఓ ప్రైవేట్‌జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో లిబియా సైన్యాధ్యక్షుడు అలీ ఉన్నారు. ఈ ఘటనలో సైన్యాధ్యక్షుడితోపాటు నలుగురు అధికారులు, ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. రన్‌వేపై నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమాన ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
టేకాఫ్ అయిన 42 నిమిషాల తర్వాత ప్రమాదం
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి అలీతోపాటు మరో నలుగురు అధికారులతో ఫాల్కన్ 50 విమానం అంకారా ఎయిర్‌పోర్ట్ నుంచి బయలు దేరింది. అనంతరం 42 నిమిషాలకు విమానంతో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. విమాన శిథిలాలను అంకారాకు నైరుతి దిశలో గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన లిబియా ప్రధాని
లిబియా సైన్యాధ్యక్షుడు జనరల్ ముహమ్మద్ అలీ మరణవార్తపై ఆదేశ ప్రధాన మంత్రి అబ్దుల్‌హమీద్ ద్బీబా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చాలా బాధ కలిగిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. టర్కీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలిపారు. లిబియాకు ఊహించని నష్టంగా అభివర్ణించారు. ఆర్మీ చీఫ్‌తో పాటు నలుగురు అధికారులు చనిపోయినట్లు ధృవీకరించారు. విమానంలోని సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని లిబియా అధికారులు తెలిపారు.
రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉన్నత స్థాయి రక్షణ చర్చల కోసం లిబియా ప్రతినిధి బృందం అంకారాలో ఉందని టర్కిష్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరణించిన మరో నలుగురు అధికారులు… లిబియా గ్రౌండ్ ఫోర్సెస్ అధిపతి జనరల్ అల్-ఫితౌరి గ్రైబిల్, మిలిటరీ తయారీ అథారిటీకి నాయకత్వం వహించిన బ్రిగేడియర్ జనరల్ మహమూద్ అల్ ఖతావి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సలహాదారు మొహమ్మద్ అల్ అసవి డియాబ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయంలో మిలిటరీ ఫోటోగ్రాఫర్ మొహమ్మద్ ఒమర్ అహ్మద్ మహజౌబ్ ఉన్నట్లు తెలిపారు.





