PM Modi On IndiGo Crisis: గత కొద్ది రోజులు కొనసాగుతున్న ఇండిగో వివాదంపై ప్రధాని మోడీ స్పందించారు. విమానాల నిర్వహణ లోపాలతో ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు తలెత్తవద్దని స్పష్టం చేశారు. చట్టాలు, నిబంధనలు ఏవైనా సరే వ్యవస్థలను సరిచేసేలా ఉండాలే తప్ప.. ప్రజలను వేధించవద్దని పేర్కొన్నారు. ఎన్డీయే ఎంపీలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఏ సంస్కరణలు అయినా ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా ఉండకూడదన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు!
ఫ్లైట్స్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్(ఎఫ్‌డీటీఎల్) రెండో దశలోని కఠిన నిబంధనల కారణంగా.. పైలట్లు, సిబ్బందిని సర్దుబాటు చేయలేక ఇండిగో విమాన సంక్షోభం తలెద్దింది. ఇలాంటి సమయంలో.. నిబంధనలు, చట్టాలు ప్రజలను ఇబ్బంది పెట్టొందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్డీయే ఎంపీల భేటీ అనంతరం ప్రధాని వ్యాఖ్యల వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. ‘‘విమాన నిర్వహణ సమస్యల కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని ప్రధాని సూచించారు. ప్రజలెవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఎదురవకూడదన్నారు. నిబంధనలు, చట్టాలు ముఖ్యమే అయినా, అవి వ్యవస్థలను సరిచేసేలా ఉండాలేగానీ.. ప్రజలను వేధించేలా ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజల జీవితాలను మరింత మెరుగుపరిచేలా సంస్కరణలు అమలు చేయడంపై ఎంపీలు దృష్టిపెట్టాలని సూచించారు’’ అని రిజిజు చెప్పారు.
ఇండిగో సర్వీసులలో 10 శాతం కోత
వందలాది విమానాల రద్దుతో సంక్షోభానికి తెరతీసిన ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు దిగింది. శీతాకాలానికి సంబంధించి ఆ సంస్థకు కేటాయించిన సర్వీసులలో 10 శాతం కోత పెట్టింది. ఈ సర్వీసులను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించనున్నట్టు తెలిపింది. ఇండిగో సర్వీసులలో 5 శాతం కోతపెడుతున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించగా.. దానిని రెండింతలు చేస్తూ, 10 శాతం కోతపెట్టాలని ఆదేశించినట్టు పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. ఇండిగో సర్వీసులను స్థిరీకరించడంకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు ఇండిగోకు రోజుకు 2,200కుపైగా సర్వీసుల నిర్వహణకు అనుమతి ఉంది. తాజా కోతతో అవి రోజు కు 1,950 కంటే తగ్గిపోనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.





