
వైఎస్ జగన్ పెట్టిన పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ. అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ఒక ప్రభంజనం సృష్టించింది. 2019 ఎన్నికల్లో చరిత్ర తిరగరాసింది. 151 సీట్లతో జయకేతనం ఎగురవేసింది. ఆ ఎలక్షన్‌లలో టీడీపీకి 21 సీట్లు మాత్రమే వచ్చాయి. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు అదో షాక్. అంతలా ప్రజాదరణ పొందిన వైసీపీ.. ఐదేళ్లు తిరగకముందే ఎందుకు పాతాళానికి పడిపోయింది. 151 సీట్ల నుంచి 11 స్థానాలకే ఎందుకు పరిమితమైంది. లోపం ఎక్కడుంది..? పాలనలోనా..? పార్టీ నాయకుడిలోనా..? వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ఒక లుక్కేద్దాం.
వైఎస్ జగన్… వైఎస్‌ఆర్ మరణం తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి 2011, మార్చి 12న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఇప్పటికి 14ఏళ్లు పూర్తయ్యింది. 2014లో వైసీపీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ… ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. కానీ.. 44.4 శాతం సాధించింది వైసీపీ. ఆ ఓటు బ్యాంక్ ఇప్పటికీ వైసీపీ సొంతం. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. నిరంతరం ప్రజల్లో ఉన్నారు వైఎస్ జగన్. ప్రజా ఉద్యమాలు చేపట్టి.. జనానికి చేరువయ్యారు. ప్రత్యేక హోదాపై కూడా పోరాటం చేశారు. ప్రజాసంకల్పయాత్ర పేరుతో 3వేల 648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండటంతో వైఎస్ జగన్‌కు, ఆయన పార్టీకి జనాదరణ బాగా పెరిగింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించారు ఏపీ ప్రజలు. 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలను వైసీపీకి ఇచ్చారు. అప్పుడు దాదాపు 50 శాతం ఓట్లు వైసీపీకి పడ్డాయి. కానీ.. 2024 ఎన్నికలు వచ్చే సరికి సీన్ రివర్స్ అయ్యింది. 151 నుంచి 11 స్థానాలకు పడిపోయింది వైసీపీ. అయితే.. ఓటు శాతం మాత్రం తగ్గలేదు. 44.28 శాతం ఓట్లు జగన్ పార్టీకి పడ్డాయి.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ… ఆకాశం నుంచి పాతాళానికి పడిపోవడం… అది కూడా ఐదేళ్లలోనే అంటే… ఆలోచించాల్సిన విషయమే. వైసీపీలో లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. పార్టీని నమ్ముకున్న నాయకులు కూడా ఉన్నారు. 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ తీరులో మార్పు వచ్చింది. నిజాయితీగా రాజకీయాలు చేయాలన్న ఉద్దేశం, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న తపనతో… ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా పూర్తిచేశారు. అయితే… క్యాడర్‌ను పక్కనపెట్టారన్న అపవాదు మూటగట్టుకున్నారు. చుట్టూ కోటరీ ఏర్పాటు చేసుకున్న… నేతలు, కార్యకర్తలను పట్టించుకోలేదని కూడా సమాచారం. వైసీపీ పాలనపై అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు… అన్నది ఆలోచించకుండా… తాను అనుకున్నది చేసుకుంటూ పోయారు. సంక్షేమం బాగానే ఉన్నా.. అభివృద్ధి మాటేంటనే..? ప్రశ్న ఏపీ ప్రజల్లో తలెత్తింది. ఆ సమస్య వైపు జగన్ అసలు దృష్టిపెట్టలేదు. దీన్ని అప్పటి ప్రతిపక్ష పార్టీ క్యాష్ చేసుకున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా చేశాయి. సంక్షేమం విషయంలోనే కాదు.. పాలనా పరంగా వైఎస్ జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా జనానికి రుచించలేదనే చెప్పాలి. మూడు రాజధానుల ప్రకటన, మండలి రద్దు వంటి ప్రతిపాదనలు… జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒకింత వ్యతిరేకతను పెంచాయి. ఇవన్నీ కలిసి.. వైసీపీకి ఘోర పరాజయం తెచ్చిపెట్టాయి. 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లకు పరిమితం చేశాయి. అయితే.. ఇదంతా గతం… మరి భవిష్యత్ ఏంటి..?
వైసీపీకి పూర్వవైభవం రావాలంటే అది జగన్‌తోనే సాధ్యం. ఘోర పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న జగన్… మళ్లీ గెలవాలన్న కసితో ఉన్నారు. అయితే.. అది ఒక్కటే సరిపోదు. గెలవాలని అనుకోవడం కాదు.. అది ఆచరణలో చూపించాలి. ఓటమికి కుంగిపోకుండా… అందుకు గల కారణాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజాపోరాటాలు ఉధృతం చేయాలి. కార్యకర్తల్లో మళ్లీ నమ్మకం కలిగించాలి. వారి విశ్వాసం చూరగొనాలి. ప్రజలకు మళ్లీ దగ్గరవ్వాలని. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని… భవిష్యత్ ప్రణాళికలపై దృష్టిపెట్టాలి. జగన్ 2.O వేరే లెవల్ అని.. కార్యకర్తలకు కూడా అండగా ఉన్నానని చెప్తున్నారు. మాటల్లోనే కాక.. ఇప్పటి నుంచే చేతల్లో కనిపించారు. జగన్ ఆలోచనా విధానం కూడా మారాలి.. పరిస్థితికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోగలగాలి. మొండి వైఖరి వీడాలి.. ప్రజాఅభిప్రాయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ముందుసాగాలి. అందుకే… జగన్ తీరు మారితే గానీ… వైసీపీకి పూర్వవైభవం రాదని అంటున్నారు అంతా.