అంతర్జాతీయం

ప్రపంచం ఆశలు భారత్ మీదే.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!

PM Modi: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్‌ అని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లు తెలిపారు. జపాన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని, టోక్యో లో ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ ఫోరం లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచం అంతా భారత్‌పైనే ఆశలు పెట్టుకుందని, విదేశీ కంపెనీలు భారత్‌ లో పెట్టుబడులు పెట్టడం పెరిగిందని అన్నారు.

భారత అభివృద్ధిలో జపాన్ కీలక భాగస్వామి

ఈ సదస్సులో భారత్‌-జపాన్‌ భాగస్వామ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. భారత్‌ అభివృద్ధిలో జపాన్‌ కీలక భాగస్వామి అని అన్నారు.  ప్రపంచం కేవలం భారతదేశాన్ని మాత్రమే చూడటం లేదన్న ఆయన.. భారత్‌ పై ఆశలు పెట్టుకుందన్నారు. భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్‌ కీలక పాత్ర పోషించిందన్నారు. మెట్రో రైళ్ల నుంచి సెమీకండక్టర్లు, స్టార్టప్‌లు సహా అనే రంగాల్లో తోడ్పాటు అందించిందన్నారు. జపాన్‌ సంస్థలు భారత్‌ లో 40 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయన్నారు.

భారత్‌లో ఆర్థిక, రాజకీయ స్థిరత్వం

ప్రస్తుతం భారత్ లో ఆర్థిక, రాజకీయ స్థిరత్వం నెలకొందని ప్రధాని మోడీ తెలిపారు. ప్రభుత్వ పరంగా పారదర్శకమైన విధానాలను అవలంభిస్తున్నట్లు చెప్పారు. భారత్‌ మార్కెట్లు భారీ రాబడిని అందిస్తున్నాయని, తమకు బలమైన బ్యాంకింగ్ రంగం, 700 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయన్నారు. అణుశక్తి, గ్రీన్‌ ఎనర్జీ, ఆటోసెక్టార్‌లో భారత్- జపాన్  కలిసికట్టుగా పని చేయాల్సిన అసవరం ఉందని మోడీ అభిప్రాయపడ్డారు.

Back to top button