
అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. అందరు భయపడుతున్నట్లే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన భారతీయుల ప్రవాసుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. అమెరికాలో చొరబాటుదారులకు స్థానం లేదని కుండబద్దలు కొట్టారు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
సరిహద్దు భద్రతపై జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ ఓ వ్యక్తి ట్రంప్ సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశాడు. ‘‘బైడెన్ హయాంలో సరిహద్దులు దాటి అక్రమంగా అమెరికాలోకి చొరబడిన అక్రమార్కులను సాగనంపుతారు. ఇందుకోసం అవసరమైతే సైన్యం సాయం తీసుకుంటారని ఆ వ్యక్తి తన పోస్టులో చెప్పుకొచ్చాడు. దీనికి రీపోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్.. ‘ట్రూ’ అని కామెంట్ పెట్టారు.
అమెరికా సరిహద్దుల భద్రత, విదేశీ వలసలకు సంబంధించిన వ్యవహారాలను చూసే కీలకమైన ‘బార్డర్ జార్’ పదవిని టామ్ హోమన్‌కు ట్రంప్ కేటాయించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో టామ్ హోమన్ మాట్లాడుతూ.. బైడెన్ నిర్లక్ష్యం వల్ల అమెరికాలోకి చొరబడి అక్రమంగా ఉంటున్న వాళ్లంతా తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధం కావాలన్నారు. ఇప్పుడే లగేజీ సర్దుకోవడం మొదలుపెడితే బెటర్ అని కామెంట్ చేశారు. ఇటువంటి అభిప్రాయం కలిగిన వ్యక్తికి బార్డర్ జార్ పదవిని ట్రంప్ కట్టబెట్టారు.