
ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయరాని భాగంగా మారింది. ఉదయం నిద్ర లేచిన క్షణం నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో ఫోన్ లేకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన భావన కలుగుతోంది. సోషల్ మీడియా, వీడియోలు, మెసేజెస్, నోటిఫికేషన్లు అంటూ రోజంతా స్క్రీన్ వైపే చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కొందరైతే అర్థరాత్రి దాటినా కూడా మొబైల్ ఫోన్లలో మునిగిపోతూ నిద్రను దూరం చేసుకుంటున్నారు.
ఈ అలవాటు వల్ల కంటి సంబంధిత సమస్యలతో పాటు శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే మొదట చేసే పని మొబైల్ ఫోన్ చూడటమే కావడం ఆందోళనకరంగా మారుతోంది. ఫోన్ చెక్ చేసిన తర్వాతే రోజు ప్రారంభించే అలవాటు చాలా మందిలో కనిపిస్తోంది.
ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్‌ను చూడటం వల్ల ఫోన్ నుంచి వెలువడే బ్లూ లైట్ కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ బ్లూ లైట్ కంటి ఒత్తిడిని పెంచడమే కాకుండా రెటీనాను దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వయసుతో పాటు వచ్చే మాక్యులర్ డీజెనరేషన్ సమస్య త్వరగా వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.
కళ్లపై ఒత్తిడి పెరగడం వల్ల కళ్లలో నొప్పి, వాపు, అలసట, పొడిబారడం, దురద వంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఎక్కువసేపు స్క్రీన్ వైపు చూస్తే కంటి చూపు మందగించే ప్రమాదం కూడా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సమస్యలు మొదట చిన్నవిగా కనిపించినా.. భవిష్యత్తులో తీవ్రమైన కంటి వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది.
ఇక నిద్రపోయే ముందు మొబైల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను వాడడం వల్ల శరీరంలోని జీవ గడియారం మారిపోతుంది. దీని ప్రభావం నిద్ర నాణ్యతపై పడుతుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు శారీరక అలసటతో పాటు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది.
ఉదయం నిద్రలేవగానే ఫోన్ చెక్ చేయడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీ మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి మెసేజెస్, ఈ-మెయిల్స్, నోటిఫికేషన్లు చూడటం వల్ల మనసుపై భారంగా మారుతుంది. రోజును మానసిక ఒత్తిడితో ప్రారంభిస్తే, ఆ ప్రభావం రోజంతా కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు.
ఒకవైపు మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్లను దెబ్బతీస్తే, మరోవైపు ఆందోళన మన ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే మొబైల్ ఫోన్ చూసే అలవాటును మానుకోవాలని, కనీసం కొంత సమయం కళ్లకు, మనసుకు విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ చిన్న మార్పు భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించగలదని నిపుణుల అభిప్రాయం.
ALSO READ: 8 ఏళ్లుగా శృంగారానికి నిరాకరిస్తోందని భార్యను చంపిన భర్త!





