Amit Shah Political Claim: భారత్ లో భారతీయ జనతాపార్టీ ప్రభంజనం కొనసాగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 2024, 2025లో బీజేపీ వరుస విజయాలు సొంతం చేసుకుందన్నారు. 2026లోనూ అదే విజయ పరంపర కొనసాగబోతుందన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే తమిళనాడు, బెంగాల్ లోనూ ఏన్డీయే ప్రభుత్వాలు ఏర్పాటు కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ మెజారిటీతో ఎన్డీయే అధికారంలోకి వస్తుందన్నారు.
తమిళనాడులో కుటుంబ పాలనకు ముగింపు
రెండ్రోజుల పర్యటనలో భాగంగా పుదుక్కోటలో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ఈసారి తమిళనాడులోని కుటుంబ పాలనకు ముగింపు పలుకుతామని చెప్పారు. “తమిళనాడులో కుటుంబ పాలనకు స్వస్తి చెప్పేందుకు సమయం ఆసన్నమైంది. మొదట కరుణానిధి, ఆ తర్వాత స్టాలిన్, ఇప్పుడు ఉదయనిధిని ముఖ్యమంత్రిని చేయాలని కలలు కంటున్నారు. ఆ కలలు నెరవేరవు” అని అమిత్‌షా అన్నారు. ప్రజాసంక్షేమం కంటే వారసత్వ రాజకీయాలకే డీఎంకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రాధాన్యతనిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా ఉదయనిధిని తదుపరి సీఎం చేయాలన్న తాపత్రయం మాత్రమే డీఎంకేలో కనిపిస్తోందని అన్నారు. తమిళనాడులో మహిళలకు భద్రతకు గ్యారెంటీ లేదని, శాంతిభద్రతలు లోపించాయని విమర్శించారు.
కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిన అమిత్ షా
అటు ఈ సభకు ముందు, తన పర్యటనలో భాగంగా తిరుచిరాపల్లి విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమిత్‌షా రాక కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. 2026 ఎన్నికల్లో పార్టీని పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ వ్యూహాలపై బీజేపీ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నేతలతో అమిత్‌షా సమావేశమయ్యారు.





