
Kolkata Horror: తెలిసిన వాళ్లే ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బర్త్ డే చేస్తామని పిలిచి డోర్ లాక్ చేసి రాత్రంతా చిత్ర హింసలు పెట్టారు. ఒకరి తర్వాత మరొకరు లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న యువకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
దక్షిణ కోల్‌కతా పూజా కమిటీ హెడ్ అయిన చందన్ మాలిక్‌కు కొన్ని నెలల కిందట హరిదేవ్‌పూర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి అయిన ద్వీప్ బిశ్వాస్‌కు ఆమెను పరిచయం చేశాడు. ఆ యువతిని పూజా కమిటీలో చేర్చుతామని వారిద్దరూ హామీ ఇచ్చారు. ఈ ముగ్గురు తరచుగా మాట్లాడుకుంటున్నారు. సెప్టెంబర్ 5న ఆ యువతి పుట్టిన రోజు. దీంతో శుక్రవారం రాత్రి బర్త్ డే సెలబ్రేషన్ పేరుతో చందన్ ఆ యువతిని రీజెంట్ పార్క్ ప్రాంతంలోని దీప్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బర్త్ డే పార్టీ తర్వాత వారు భోజనం చేశారు. ఆ యువతి తన ఇంటికి వెళ్తానని చెప్పగా వారిద్దరూ డోర్ లాక్ చేశారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తప్పించుకుని బయటపడ్డ యువతి
తర్వాత రోజు ఉదయం యువతి అక్కడి నుంచి తప్పించుకున్నది. తన ఇంటికి చేరుకున్న తర్వాత జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తర్వాత తనపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులైన చందన్, దీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిద్దరిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.