
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారబోతోందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవైపు వర్షాలు, మరోవైపు చలి తీవ్రతతో కూడిన మంచు ప్రభావం పెరగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న కొన్ని రోజులు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అస్థిరంగా ఉండనున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది.
దక్షిణ-ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొంత బలహీనపడే అవకాశాలు ఉన్నప్పటికీ, దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తప్పక ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జనవరి 9వ తేదీ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించారు.
వర్షాలతో పాటు చలి తీవ్రత కూడా మరింత పెరుగనుందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉండటంతో పాటు కోస్తా జిల్లాల్లో దట్టమైన మంచు కురుస్తోంది. ఈ మంచు ప్రభావం మరో 4 రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తా ప్రాంతాలకే కాకుండా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ మోస్తరు స్థాయి మంచు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
మంచు ప్రభావంతో ఉదయం పూట దృశ్యమానత తగ్గే అవకాశం ఉండటంతో వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులు, హైవేల్లో ప్రయాణించే సమయంలో అప్రమత్తత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో రవాణా శాఖ, పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వాహనదారులు ప్రయాణ సమయంలో లేన్లు అకస్మాత్తుగా మార్చకుండా, నిదానంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. మంచు తీవ్రంగా ఉన్న సమయంలో వాహనాన్ని రోడ్డుపక్కకు నిలిపివేయడం ఉత్తమమని తెలిపారు. అలాగే వెనుక నుంచి వచ్చే వాహనాలకు ముందస్తు హెచ్చరికగా ఇండికేటర్లు తప్పనిసరిగా వాడాలని సూచించారు. చలికాలంలో రోడ్లు తడిగా ఉండటంతో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల సడన్ బ్రేకులు వేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కారు ప్రయాణికులు అద్దాలను కొద్దిగా దించడం ద్వారా లోపల పొగమంచు కేంద్రీకృతం కాకుండా చూసుకోవచ్చని, దీనివల్ల డ్రైవర్‌కు స్పష్టమైన చూపు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలు, చలి, మంచు కలిసి ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రజలు అనవసర ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ALSO READ: BIG NEWS: ఇక వారికి ఉచిత కరెంట్!





