
Crypto scam: విశాఖపట్నం పోలీసు శాఖలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడి వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. చట్టాన్ని రక్షించాల్సిన అదే విభాగానికి చెందిన వంద మందికి పైగా సిబ్బంది కోట్ల లాభాలు వస్తాయని నమ్మబలికబడి మోసపోయినట్లు వెలుగులోకి రావడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. క్రిప్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం కఠిన నియంత్రణలు అమలు చేస్తున్న సమయంలో, పోలీసులే భారీ మొత్తాలు పెట్టుబడి పెట్టి నష్టపోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే శాఖ అంతటా కలకలం రేపింది. లోవరాజు అనే కానిస్టేబుల్ మూడు లక్షలు పెట్టుబడి పెడితే యాభై వేల లాభం వస్తుందని నమ్మబలికి, పలువురు అధిక మొత్తాలు పెట్టడానికి దారితీశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశపడి మరింత పెద్ద మొత్తాలు పెట్టిన కొందరు సీఐ స్థాయి అధికారులు కూడా ఈ దందాలో ఉన్నారన్న ఊహాగానాలు బయటకువస్తున్నాయి.
ఘటనలో బాధితులందరూ పోలీసులే కావడం విచిత్రంగా మారింది. సాధారణ ప్రజలు మోసపోతే వెంటనే స్పందించే వారు తమే మోసపోయిన సందర్భంలో ఒక్కరు కూడా అధికారికంగా ఫిర్యాదు చేయకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఫలితంగా ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. అయితే ఇంటెలిజెన్స్ విభాగం దృష్టికి విషయం చేరడంతో ఉన్నతాధికారులు స్వయంగా విచారణ ప్రారంభించారు. మొత్తం ఎవరెవరికి నష్టం జరిగిందో, దందాను నడిపింది ఎవరో, ఎంత మొత్తం ఈ వ్యవహారంలో గిరాకీ అయిందో తెలుసుకునేందుకు అంతర్గత దర్యాప్తు కొనసాగుతోంది. విశాఖ కమిషనరేట్ పరిధిలో 8 జోన్లు ఉన్నప్పటికీ ఎక్కడి నుంచీ ఫిర్యాదు రాకపోవడంతో చట్టపరంగా ముందడుగు ఎలా వేయాలన్నదానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం కానిస్టేబుల్ లోవరాజు పాత్రపై దృష్టి సారించిన అధికారులు, అతడు ఎంతమందిని పెట్టుబడి పెట్టించాడో, ఎంత మొత్తం వసూలు చేసాడో, ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా ఇందులో ప్రమేయం ఉన్నారో లేదో అన్న అంశాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు శాఖలోనే ఇలాంటి వ్యవహారం జరగడం పోలీసు వ్యవస్థ ప్రతిష్టను సవాలు చేసే ఘటనగా నిలిచింది.
ALSO READ: Suicide: అత్తింటి వేధింపులు తాళలేక అల్లుడు ఆత్మహత్య





