
-
గుజరాతీల కంపెనీలతో రూ.200 కోట్ల పెట్టుబడి ఒప్పందంపై అనుమానం
-
హవాలా ముసుగులో భూమి డీల్.! కేంద్ర నిఘా వర్గాల ఫోకస్ తెలంగాణ నేతలపై!
-
రూ.200 కోట్ల పెట్టుబడి వెనక గుట్టు..! అమెరికా గుజరాతీ కంపెనీతో రహస్య ఒప్పందం!
-
ముఖ్య నేత సన్నిహితులపై నిఘా దర్యాప్తు… విదేశీ పెట్టుబడుల వెనక హవాలా బంధాలు!
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్, న్యూఢిల్లీ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలోని పలువురు కీలక వ్యక్తులపై కేంద్ర నిఘా వర్గాలు కన్నేసినట్లు విశ్వసనీయ సమాచారం లభించింది. అమెరికాలో గుజరాతీలకు చెందిన కొంతమంది వ్యాపారవేత్తలతో తెలంగాణకు చెందిన రాజకీయంగా ప్రభావవంతులైన వ్యక్తులు కలిసి హవాలా మాధ్యమంగా భారీ స్థాయి లావాదేవీలకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలిసింది.
వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లాకు చెందిన నామినేటెడ్ పోస్టులో ఉన్న ఒక కీలక నేత, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతకు సన్నిహిత అనుచరుడు, ఢిల్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ప్రజా ప్రతినిధి, అలాగే అమెరికా తానా (TANA) లో కీలక పదవిలో పని చేసిన ఓ ప్రముఖుడు ఈ నలుగురు కలిసి ఇటీవల అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో గుజరాతీ వ్యాపారవేత్తల కంపెనీతో రూ.200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర నిఘా వర్గాల దర్యాప్తులో బయటపడింది.
ఈ పెట్టుబడి బదులుగా తెలంగాణలో ఆ గుజరాతీ వ్యాపారవేత్తలు పెట్టబోయే కంపెనీలకు భూములు కేటాయించి, ప్రభుత్వ అనుమతులు, రాయితీలు కల్పిస్తామని ఆ నలుగురు హమీ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం నేపథ్యంలో అమెరికాలో ఉన్న ఆ వ్యాపారవేత్తలు ఇటీవల హైదరాబాద్ వచ్చి భూసంబంధిత అంశాలపై చర్చించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో కేంద్ర నిఘా సంస్థలు ఆ లావాదేవీల వెనుక ఉన్న ఆర్థిక మూలాలు, డబ్బు ప్రవాహం మార్గం, హవాలా లింకులు వంటి అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నాయి. ఈ వ్యవహారం వెనుక రాష్ట్రంలోని ఒక ముఖ్య రాజకీయ నాయకుడు ఉన్నారని నిఘా వర్గాల అనుమానం. ఆయనకు అత్యంత సన్నిహితులైన ఈ నలుగురు వ్యక్తులు విదేశీ పెట్టుబడి పేరుతో వాస్తవానికి హవాలా నిధులను రాబట్టే ప్రయత్నం చేశారా అనే దానిపై పరిశీలన కొనసాగుతోందని సమాచారం.
ఇంత పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడి పెట్టేందుకు ఆ నేతల వద్ద డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే అంశం ప్రస్తుతం ఇంటెలిజెన్స్ వర్గాల ప్రధాన ఫోకస్ అయింది… దీనికి సంబంధించి కేంద్ర నిఘా సంస్థలు ఇప్పటికే అమెరికాలోని సంబంధిత బ్యాంకుల నుండి ట్రాన్సాక్షన్ రికార్డులు, కంపెనీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సేకరిస్తున్నట్లు తెలిసింది. అలాగే, తెలంగాణలోని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఐటీ ఆధారిత సంస్థలు, మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్ల తో ఉన్న లింకులను కూడా సవివరంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
చట్టపరమైన కోణంలో FEMA ఉల్లంఘన?
విదేశీ పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన FEMA (Foreign Exchange Management Act) నిబంధనల ప్రకారం పెట్టుబడులన్నీ పారదర్శకంగా, అధికారిక మార్గాల ద్వారా జరగాలి. కానీ హవాలా లావాదేవీల రూపంలో నిధులు పంపడం చట్ట విరుద్ధం. ఈ వ్యవహారం నిజమైతే ఆర్థిక నేరాల నిరోధక చట్టం (PMLA) ప్రకారం కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అనుమతులు, రాయితీలు వంటి విషయాల్లో వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుకోవడమేనా? అనే ప్రశ్నలు లేవుతున్నాయి. అధికార వర్గాలు ఈ ఘటనపై స్పందించకపోయినా, కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రంలోని కొంతమంది కీలక నేతల ఫోన్ సంభాషణలు, ఫైనాన్షియల్ ట్రైల్స్, మరియు అంతర్జాతీయ లింకులను నిశితంగా పరిశీలిస్తున్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం… కేంద్ర నిఘా వర్గాల ఆరా ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వాతావరణంలో కొత్త తుఫాన్ లా మారింది. పెట్టుబడుల ముసుగులో హవాలా నిధుల ప్రవాహం జరుగుతోందా? లేదా ఇది కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమేనా?… దీనికి సమాధానం వచ్చే కొన్ని వారాల్లో దర్యాప్తు ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.