
హైదరాబాద్ నగరంలో గంజాయి మత్తు పెరిగిపోతున్నదానికి మరో ఉదాహరణగా జీడిమెట్లలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దేవాలయ పరిసరాల్లోనే గంజాయి సేవిస్తూ అడ్డంగా ప్రవర్తించిన యువకులు, ప్రశ్నించిన మహిళలపై దాడికి దిగడం నగర భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.
జీడిమెట్ల పరిధిలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో సోమవారం రాత్రి ఇద్దరు యువకులు గంజాయి సేవిస్తూ కనిపించారు. పవన్ కల్యాణ్ (20), సంఘీ (20) అనే యువకులు బహిరంగ ప్రదేశంలో గంజాయి తాగుతూ అశ్లీలంగా ప్రవర్తించడం అక్కడున్న కాలనీవాసుల దృష్టికి వచ్చింది. అదే కాలనీకి చెందిన ఇద్దరు మహిళలు ఈ విషయాన్ని గమనించి వారిని నిలదీశారు. దేవాలయం వద్ద ఇలాంటి చర్యలు చేయడం సరికాదని హెచ్చరించారు.
అయితే గంజాయి మత్తులో ఉన్న యువకులు తమను ప్రశ్నించడాన్ని సహించలేకపోయారు. మమ్మల్నే అడుగుతారా అంటూ ఆగ్రహంతో రెచ్చిపోయి, మాటల దాడి నుంచి శారీరక దాడికి దిగారు. ఇద్దరు మహిళలను విచక్షణారహితంగా కొట్టడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళల అరుపులు విన్న కాలనీవాసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
స్థానికులు సమయస్ఫూర్తితో స్పందించి యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించి వారిని అప్పగించారు. ఈ ఘటనతో కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి. దేవాలయ పరిసరాల్లోనే గంజాయి మత్తులో యువకులు రెచ్చిపోవడం తమ భద్రతకు ముప్పుగా మారిందని మహిళలు, కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. తమ కాలనీలో గంజాయి బ్యాచ్ అరాచకాలను వెంటనే అరికట్టాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు విధించాలని కోరారు.
నగరంలో గంజాయి వినియోగం రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యువత గంజాయి మత్తులో నేరాలకు పాల్పడటం, మహిళలపై దాడులు జరగడం తీవ్ర ఆందోళనకరంగా మారిందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. గంజాయి సరఫరా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
ALSO READ: హిందూ మహిళను అత్యాచారం చేసి.. చెట్టుకు కట్టేసి!.. (VIDEO)





