క్రైమ్తెలంగాణ

ముగ్గురు పిల్లలు, 9 నెలల గర్భిణీ భార్యను పోషించలేక షాకింగ్ పని చేసిన 30 ఏళ్ల వ్యక్తి

కుటుంబ బాధ్యతలు భరించలేక ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

కుటుంబ బాధ్యతలు భరించలేక ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నారుల భవిష్యత్తు, కుటుంబ పోషణ భారం తనపై మోపబడుతోందన్న ఆందోళన ఆ యువకుడిని మృత్యువైపు నడిపించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసుల వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం వీరాపూర్ దుబ్బా గ్రామానికి చెందిన ప్రహ్లాద్ (30) రోజువారీ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇదే గ్రామానికి చెందిన సౌందర్యతో పదేళ్ల క్రితం అతనికి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. స్నేహ (8), హర్షిత (6), వసుంధర (4) అనే ముగ్గురు పిల్లల భవిష్యత్తుపై ప్రహ్లాద్ ఎప్పుడూ ఆందోళన చెందేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

రోజువారీ కూలీ ఆదాయంతోనే కుటుంబాన్ని నడుపుతూ పిల్లల చదువు, రేపటి జీవితం గురించి తీవ్రంగా ఆలోచించేవాడని తెలిపారు. ముఖ్యంగా తనకు ఆడపిల్లలే కావడంతో వారిని ఎలా చదివించాలి, ఎలా పెంచాలి, భవిష్యత్తులో వివాహాలు ఎలా చేయాలనే భయం అతన్ని మానసికంగా కుంగదీసిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతను పలుమార్లు నిరాశకు లోనయ్యాడని సమాచారం.

ప్రస్తుతం ప్రహ్లాద్ భార్య సౌందర్య 9 నెలల గర్భిణిగా ఉంది. ఈ నెల 26లోపు కాన్పు అవుతుందని వైద్యులు కుటుంబానికి తెలిపారు. నాలుగో సంతానం కూడా కుమార్తెగా జన్మించవచ్చన్న ఆందోళన అతని మనసును పూర్తిగా కలవరపెట్టిందని తెలుస్తోంది. ఈ భయమే అతన్ని అత్యంత దురదృష్టకర నిర్ణయానికి తీసుకెళ్లిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

శనివారం మధ్యాహ్నం ఇంట్లో కుటుంబ సభ్యులు చూస్తుండగానే ప్రహ్లాద్ విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబీకులు అతన్ని చికిత్స కోసం బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ప్రహ్లాద్ మృతి చెందాడు.

ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. భార్య సౌందర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా ప్రహ్లాద్ గతంలో కూడా మూడు సార్లు ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అప్పట్లో కుటుంబీకులు, గ్రామస్థులు జోక్యం చేసుకుని అతన్ని కాపాడారని చెప్పారు. అయితే ఈసారి మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరగడంతో అతన్ని ఆపలేకపోయారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురు చిన్నారులు, గర్భిణి భార్యను వదిలి వెళ్లిపోయిన ప్రహ్లాద్ నిర్ణయం అందరినీ కలచివేసింది.

ALSO READ: ఉదయం లేచాక ఈ లక్షణాలు కనిపిస్తే మీరు డేంజర్‌లో ఉన్నట్లే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button