క్రైమ్తెలంగాణ

ఫైవ్‌స్టార్ రేటింగ్స్ పేరుతో సైబర్ మోసం

రూ.2 లక్షలు కోల్పోయిన మహిళ

క్రైమ్ మిర్రర్, రామకృష్ణాపూర్: ఫైవ్‌స్టార్ రేటింగ్స్ ఇస్తే డబ్బులు సంపాదించవచ్చంటూ సైబర్ నేరగాళ్లు వేసిన వలలో చిక్కిన ఓ మహిళ రూ.2 లక్షలు కోల్పోయిన ఘటన రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. ఈ ఘటన గత ఏడాది 2025లో జరగగా, బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా కేసు నమోదు అయింది.

 

పోలీసులు, బాధితురాలి వివరాల మేరకు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహిళకు గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్‌లో సందేశం వచ్చింది. రెస్టారెంట్లకు ఫైవ్‌స్టార్ రేటింగ్స్ ఇస్తే ఆదాయం వస్తుందని నమ్మించి, టెలిగ్రామ్ యాప్ లింక్ పంపించారు. అందులో ఇచ్చిన టాస్కులు పూర్తి చేస్తే లాభాలు వస్తాయని, ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే అధిక రాబడి వస్తుందంటూ మోసగాళ్లు ఆశ చూపారు.

 

వారి మాటలు నమ్మిన మహిళ తొమ్మిది దఫాలుగా వివిధ లింకుల ద్వారా సుమారు రూ.2 లక్షలు పంపింది. అనంతరం లాభాలు గానీ, పెట్టిన డబ్బులు గానీ తిరిగి రాకపోవడంతో టెలిగ్రామ్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా, నిందితులు ఆమె వాట్సాప్ నంబర్‌ను బ్లాక్ చేశారు. మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయగా, ఆన్‌లైన్‌లో కేసు నమోదు అయింది.

 

ఈ మేరకు స్థానిక ఎస్సై భూమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్సై భూమేష్ మాట్లాడుతూ, గుర్తుతెలియని వ్యక్తులు పంపే సందేశాలు, కాల్స్, లింకులను నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు. తెలియని యాప్స్, వెబ్‌సైట్లు, ఆన్లైన్ లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఫోటో మోర్ఫింగ్, అసభ్య వీడియోలతో బెదిరింపులకు పాల్పడే ఘటనలు కూడా పెరుగుతున్నాయని, ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button