
ఒడిశా రాష్ట్రంలో ఉత్కంఠను రేపిన సంఘటన వెలుగుచూసింది. పెంపుడు కుక్కపై చిరుత దాడి చేయగా, దానిని కాపాడేందుకు వెళ్లిన వ్యక్తి ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు కత్తితో ఎదురుదాడి చేయడంతో చిరుత మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలో చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
వివరాల్లోకి వెళితే.. కటక్ జిల్లా నర్సింగ్‌పూర్ వెస్ట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఓ గ్రామంలో సుభ్రాంశు భోల్‌కు చెందిన ఫామ్‌హౌస్ ఉంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుత ఫామ్‌హౌస్‌లోకి చొరబడింది. ఆ సమయంలో ప్రాంగణంలో ఉన్న పెంపుడు కుక్క చిరుతను గమనించి గట్టిగా మొరగడం ప్రారంభించింది.
కుక్క అరుపులకు చిరుత దాడికి దిగింది. ఈ క్రమంలో ఫామ్‌హౌస్‌లో ఉన్న సుభ్రాంశు భోల్ కుమారుడు అలెర్ట్ అయ్యాడు. తన పెంపుడు కుక్కను కాపాడేందుకు వెంటనే బయటకు వచ్చాడు. అయితే ఆ వ్యక్తిని గమనించిన చిరుత అతడిపైనే దాడి చేసింది. ఆకస్మికంగా ఎదురైన ప్రమాదంలో అతడు తీవ్ర భయాందోళనకు గురైనా వెనకడుగు వేయలేదు.
ప్రాణాలను కాపాడుకోవడం, కుక్కను రక్షించుకోవడం కోసం చిరుతతో ధైర్యంగా పోరాడాడు. ఈ క్రమంలో అతడి వద్ద ఉన్న కత్తితో చిరుతను పొడిచినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన చిరుత అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. అయితే ఈ దాడిలో ఆ వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయి.
చిరుత మృతి చెందిన అనంతరం గాయాలతో ఉన్న వ్యక్తి ఫామ్‌హౌస్‌లోని ఓ గదిలో దాక్కున్నాడు. వెంటనే తన తండ్రి సుభ్రాంశు భోల్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించాడు. వెంటనే అక్కడికి రావాలని, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని అతడికి ప్రాథమిక చికిత్స అందించారు.
తీవ్ర గాయాల నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం అతడిని కటక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతి చెందిన చిరుతను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చిరుత గ్రామంలోకి ఎలా వచ్చింది, భద్రతా లోపాలేమైనా ఉన్నాయా అనే అంశాలపై సంయుక్త కమిటీతో దర్యాప్తు చేపడతామని అధికారులు వెల్లడించారు. అటవీ ప్రాంతాలకు సమీప గ్రామాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సూచించింది.
ALSO READ: ఇన్ స్టా పరిచయం.. స్టూడెంట్‌పై అత్యాచారం





