
Xi Jinping: చైనా ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జీవిత కాలంపాటు అధికారాన్ని అనుభవించేలా, కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ నెమ్మదిగా తన అధికార కాంక్షను వదులుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సుమారు పుష్కర కాలంగా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న ఆయన.. తన అధికారాలను ఒక్కొక్కటిగా తన సహచరులకు అప్పగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ అప్పగింత పూర్తి అయిన తర్వాత ఆయన పదవీ విరమణ పొందే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
జూన్ 30న కీలక సమావేశం
జూన్ 30న చైనాలో అత్యంత కీలకమైన సమావేశం జరిగింది. పార్టీ వ్యవస్థల పని విధానాలను నిర్ణయించే కొత్త నిబంధనలపై 24 మంది సభ్యుల అత్యంత శక్తిమంతమైన కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జిన్ పింగ్ అధ్యక్షతన జరిగినట్లు తెలుస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు బాధ్యతల నిర్వహణకు, సీపీసీ కేంద్ర కమిటీ నిర్ణయాత్మక శక్తికి, వ్యవస్థల మధ్య సమన్వయానికి ఈ కొత్త నిబంధనలు అవసరమని తేల్చి నట్లు సమాచారం. ఈ పరిణామాలు అన్నీ జిన్ పింగ్ పదవీ విరమణకు సంకేతాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరింత పెద్ద విషయాలపై ఫోకస్ పెట్టారా?
మరోవైపు అత్యంత శక్తివంతమైన జిన్ పింగ్ కావాలనే కొన్ని బాధ్యతలను సహచరులకు అప్పగిస్తున్నారని మరికొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. మరింత పెద్ద అంశాలపై దృష్టి పెట్టడానికి ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, రోజువారీ కార్యక్రమాలను దూరంగా ఉండాలని ఆయన తన అధికారాలలో కొన్నింటిని సహచరులకు బదలాయింపు చేయాలని నిర్ణయించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. అసలు విషయం ఏంటనేది త్వరలో బయటకు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read Also: ఆ పార్టీతో గందరగోళమే.. మస్క్ పార్టీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!