తెలంగాణ

యాదాద్రి కాంగ్రెస్ జడ్పీ చైర్మెన్ గా పాక మంజుల మల్లేష్ యాదవ్?

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. ఆశావాహులు సందడి చేస్తున్నారు. ఈనెల 9 నుంచి తొలివిడత జరిగే ఎన్నికలకు నామినేషన్లు మొదలు కానున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను స్థానిక బరిలో దించటానికి కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెంచింది. 80 శాతానికి పైగా స్థానాలు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేశారు. జడ్పీ చైర్మెన్లుగా బలమైన నేతలను గుర్తించాలని సూచించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉంది. జిల్లా పరిధిలోని మొత్తం అసెంబ్లీ స్థానాల కాంగ్రెస్ గెలుచుకుంది. ఎంపీ సీటును కైవసం చేసుకుంది. స్థానిక ఎన్నికల్లో హస్తం పార్టీ హవా కొనసాగించటానికి అధికార పార్టీ నేతలు వ్యుహాలు రచిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మెన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో పార్టీ సీనియర్ నేతగా ఉన్న పోచంపల్లి మండల అధ్యక్షుడు పాక మంజుల మల్లేష్ యాదవ్ కు జడ్పీ చైర్మెన్ పదవి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, బీసీ అగ్రనేతగా ఉన్నారు పాల మంజుల మల్లేష్ యాదవ్. ఆయన సొంత మండలం పోచంపల్లికి ఈసారి బీసీకి రిజర్వ్ అయింది. దీంతో పోచంపల్లి నుంచి జడ్పీటీసీగా గెలిచి.. జడ్పీ చైర్మెన్ గా ఎన్నిక కావటానికి ఆయన లైన్ క్లియరైంది.

పాక మల్లేష్ యాదవ్ గత నాలుగు దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోచంపల్లి జడ్పీటీసీగా గెలిచారు. అంతకుముందు కనుముక్కల సర్పంచ్ గా పని చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎంతగానే శ్రమించారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకా.. కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది గులాబీ పార్టీలో చేరారు. కాని పాక మల్లేష్ యాదవ్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ కోసం కష్టపడ్డారు.భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో అనిల్ కుమార్ రెడ్డి గెలుపులో కీలకంగా వ్యవహరించారు పాక మంజుల మల్లేష్ యాదవ్. ఎంపీ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం శ్రమించారు.

జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశిస్సులు కూడా పాక మంజుల మల్లేష్ యాదవ్ కు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇప్పటికే పాక మంజుల మల్లేష్ యాదవ్ కు జడ్పీ చైర్మెన్ పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలకు సూచించారని తెలుస్తోంది. గతంలోనే బీసీ కోటాలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి పాక మల్లేష్ కు ఇవ్వాలని పీసీసీకి ప్రతిపాదన పంపారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. కాని ఆయనకు దక్కలేదు. దీంతో జడ్పీ చైర్మెన్ పదవి ఇవ్వాలని కుంభం గట్టిగా పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ కుడా మల్లేష్ యాదవ్ విషయంలో సానుకూలంగా ఉన్నారని టాక్. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం భువనగిరి జడ్పీ చైర్మెన్ సీటు కోసం పాల మంజుల మల్లేష్ యాదవ్ కు మద్దతుగా ఉన్నారని సమాచారం. మొత్తంగా ఇద్దరు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మెన్ గా పాక మంజుల మల్లేష్ యాదవ్ ఎన్నిక కావడం ఖాయమనే చర్చ జిల్లాలో, కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button