జాతీయంతెలంగాణ

ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ - చర్చించిన కీలక అంశాలు ఇవే..

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణ చీఫ్‌ సెక్రటరీ శాంతకుమారి, డీజీపీ జితేందర్‌, ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్‌ దగ్గర జరుగుతున్న సహాయక చర్యలను ప్రధానికి వివరించింది సీఎం రేవంత్‌రెడ్డి బృందం. రెస్క్యూ ఆపరేషన్స్‌ కోసం కేంద్రం నుంచి మరింత సహాయం కావాలని కోరినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుద్దరణ గురించి ప్రధాని మోడీతో చర్చించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ… అక్కడి యమునా నదిని శుద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది. అదే విధంగా… హైదరాబాద్‌ మీదుగా ప్రవహిస్తున్న మూసీ పునరుద్దీకరణను తాము చేపడుతున్నామని… అందుకు కేంద్రం నుంచి సహకారం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం, మెట్రో విస్తరణ, ట్రిపుల్‌ ఆర్‌కి కూడా సహకరించి.. సాయం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి.

ఇక.. విభజన హామీల విషయం కూడా ప్రస్తావించినట్టు సమాచారం. విభజన హామీల్లో ఇంకా కొన్ని అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి… వాటన్నింటి గురించి కూడా చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర నుంచి రావాల్సిన నిధులు కూడా విడుదల చేయాలని ప్రధాని మోడీని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి.

Back to top button