
crime mirror, health tips: ఇంట్లో ఫ్రిజ్ ఉందంటే ఆహార పదార్థాలన్నీ ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయని చాలామంది అనుకుంటాం. మిగిలిపోయిన కూరలు, అన్నం, పండ్లు, పాలు.. ఇలా ఒకటేమిటి అనేక వస్తువులను ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు.
అయితే ఏ ఆహారాన్ని ఎలా నిల్వ చేయాలి…? వండిన ఆహారాన్ని ఎప్పుడు ఫ్రిజ్‌లో పెట్టాలి…? ఎంతకాలం నిల్వ చేయవచ్చు…? అనే విషయాలపై అవగాహన లేకపోతే ఆహారం త్వరగా పాడవడమే కాకుండా ఆరోగ్య సమస్యలకూ దారితీయవచ్చు.
-
వండిన ఆహారాన్ని బయటే వదిలేయొద్దు
వంట పూర్తయిన తర్వాత ఆహారాన్ని గంటల తరబడి రూమ్ టెంపరేచర్ వద్ద ఉంచడం మంచిది కాదు. సాధారణంగా పాడయ్యే అవకాశం ఉన్న ఆహారాన్ని రెండు గంటల్లోపు ఫ్రిజ్‌లో పెట్టాలి. వాతావరణం 32 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే ఒక గంటలోపే చల్లబరచాలి.
పెద్ద పాత్రలో ఉన్న వేడి ఆహారాన్ని చిన్న, తక్కువ లోతు ఉన్న పాత్రల్లోకి మార్చి ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా చల్లబడుతుంది. ఆహారాన్ని చల్లారే వరకు గంటల తరబడి బయట ఉంచకండి.
-
పచ్చి పదార్థాలు, వండిన ఆహారం వేర్వేరుగా ఉంచండి
పచ్చి మాంసం, చేపలు వంటి పదార్థాల నుంచి వాటి రసాలు ఇతర ఆహారంపై పడకుండా జాగ్రత్తపడాలి. వీటిని మూత ఉన్న పాత్రల్లో ఫ్రిజ్ కింద భాగంలో ఉంచడం మంచిది. వండిన ఆహారాన్ని కూడా మూత ఉన్న శుభ్రమైన పాత్రల్లో నిల్వ చేయాలి. పచ్చి పదార్థాల నుంచి సూక్ష్మజీవులు ఇతర ఆహారానికి చేరకుండా వేర్వేరుగా ఉంచడం ముఖ్యం.
-
ఫ్రిజ్ ఉష్ణోగ్రతను గమనించండి
ఫ్రిజ్ ఉష్ణోగ్రతను 4 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉంచడం ఆహార భద్రతకు అనుకూలం. ఫ్రీజర్ ఉష్ణోగ్రత సాధారణంగా మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండాలి. అయితే ఫ్రిజ్‌లో పెట్టినంత మాత్రాన ఆహారం ఎప్పటికీ పాడవకుండా ఉండదు.
నిల్వ చేసిన రోజును గుర్తుంచుకోండి. వాసన, రంగు మారిన ఆహారాన్ని అస్సలు తినకండి. అలాగే ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉన్న ఆహారం ఎప్పుడూ వాసనలో మార్పు చూపకపోవచ్చనే విషయాన్ని గుర్తించాలి.
-
ఫ్రిజ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి
ఫ్రిజ్‌లో పాడైన పండ్లు, కూరగాయలు, ఎక్కువ రోజులు నిల్వ ఉన్న పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించండి. ఆహారం ఒలికిన చోట్లను వెంటనే శుభ్రం చేయండి. ఫ్రిజ్‌లో గాలి ప్రసరణకు తగిన స్థలం ఉండేలా వస్తువులను అమర్చండి.
చివరిగా.. ఫ్రిజ్ వినియోగంలో ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆహారం వృథా కాకుండా చూసుకోవడంతోపాటు ఆహార భద్రతను మెరుగుపరచవచ్చు. ఏ పదార్థాన్ని ఎంతకాలం నిల్వ చేయాలనే విషయంలో దాని స్వభావం, వండిన విధానం, నిల్వ ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకోండి.
……