క్రైమ్తెలంగాణ

కొడుకు వివాహేతర సంబంధం.. తండ్రిని వేటకొడవళ్లతో నరికిన ప్రత్యర్థులు

వివాహేతర సంబంధాలే చావులకు కారణమవుతున్నాయన్న భావన సమాజంలో బలపడుతోంది.

వివాహేతర సంబంధాలే చావులకు కారణమవుతున్నాయన్న భావన సమాజంలో బలపడుతోంది. గతంలో భర్తలు, భార్యలు, వారి ప్రియులు, ప్రియురాళ్ల మధ్యే ఈ తరహా నేరాలు జరుగుతున్నాయని అనుకుంటే.. ఇప్పుడు అదే మంట కుటుంబ సభ్యుల వరకు విస్తరిస్తోంది. వివాహిత సంబంధాల కారణంగా రక్త సంబంధీకులే బలవుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి హృదయ విదారక ఘటన పాలమూరు జిల్లా దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన దానం మైబు దేవరకద్ర మార్కెట్ యార్డులో హమాలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సాధారణ జీవితం సాగిస్తున్న అతడి కుటుంబంలో కలహానికి కారణం అతడి కుమారుడు అనిల్ వ్యవహారం. అనిల్ అదే గ్రామానికి చెందిన అక్కినొళ్ల రాఘవులు భార్యతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న విషయం గ్రామంలో నెమ్మదిగా బయటపడింది.

ఈ వ్యవహారం ఇరువురు కుటుంబాల్లో తెలియడంతో గతంలోనే పలుమార్లు గొడవలు జరిగాయి. పెద్దలు మందలించినా, హెచ్చరించినా అనిల్, రాఘవులు భార్య తమ ప్రవర్తనలో ఎలాంటి మార్పు తెచ్చుకోలేదు. దీంతో కుటుంబాల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి.

ఈ పరిస్థితుల్లో తీవ్ర మనస్థాపానికి గురైన రాఘవులు చివరకు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. విషయం తెలిసిన వెంటనే మైబు తన కుమారుడు అనిల్‌ను గ్రామం నుంచి హైదరాబాద్‌కు పంపించి దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు ఆగలేదు.

తమ్ముడి మృతికి కారణమైన వారిపై రాఘవులు అన్న హనుమన్న తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనతో చిన్నరాజమూరు గ్రామానికి చెందిన చిన్నరాములును సంప్రదించాడు. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా దొడ్డలోనిపల్లికి చెందిన గొల్ల మల్లేశ్, మణికొండ గ్రామానికి చెందిన శరత్‌తో పరిచయం ఏర్పడింది.

తన తమ్ముడి చావుకు కారణమైన అనిల్ లేదా అతడి తండ్రి మైబును హతమార్చాలని నిర్ణయించిన హనుమన్న రూ.8 లక్షలకు సుపారీ సెట్ చేశాడు. హత్యకు ముందుగా రూ.3.90 లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించాడు. మిగిలిన మొత్తాన్ని హత్య అనంతరం ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్ అందడంతో సుపారీ గ్యాంగ్ హత్యకు సిద్ధమైంది.

అనిల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండటంతో అతడిని వదిలేసి తండ్రి మైబునే టార్గెట్‌గా ఎంచుకున్నారు. మైబు కదలికలపై సుమారు వారం రోజుల పాటు నిఘా ఉంచారు. అక్టోబర్ 24న దేవరకద్ర మార్కెట్ యార్డులో హమాలీ పని ముగించుకుని మైబు ఒంటరిగా బైక్‌పై గ్రామానికి వెళ్తున్నాడని గుర్తించారు. అజిలాపూర్ స్టేజీ వద్ద బైక్‌ను అడ్డగించి వేట కొడవళ్లతో దాడి చేశారు. మైబు తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించినా నిందితులు వెంటాడి కిరాతకంగా నరికి హత్య చేశారు.

హత్య అనంతరం ఉపయోగించిన కొడవళ్లను సమీపంలోని నీటి గుంతలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్ డేటా, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో మైబు కుమారుడు అనిల్ వివాహేతర సంబంధమే హత్యకు మూలకారణమని నిందితులు అంగీకరించారు. సుపారీ వివరాలు కూడా పోలీసుల ముందు వెల్లడించారు. దీంతో ప్రధాన నిందితుడు అక్కినొళ్ల హనుమన్నతో పాటు గొల్ల మల్లేశ్, చిన్నరాములును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు ఇప్పటికే ఇతర హత్య కేసులో జైలులో ఉండటంతో పీటీ వారెంట్ జారీ చేసి అరెస్టు చేయనున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

కుమారుడు చేసిన తప్పుకు తండ్రి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర భయాందోళనకు దారి తీసింది. వివాహేతర సంబంధాల కారణంగా ఏ తప్పు చేయని కుటుంబ సభ్యులు బలవడం పట్ల గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: చలికాలంలో మూత్రం రంగు మారుతోందా..? అయితే కారణాలు ఇవే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button