Shubhanshu Shukla Wisdown Teeth: ఆస్ట్రోనాట్స్ కు దంత ఆరోగ్యం చాలా కీలకమని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చిన తొలి భారతీయుడు, ఐఏఎఫ్ టెస్ట్ పైలట్ శుభాంశు శుక్లా తెలిపారు. తన అంతరిక్ష యాత్ర కోసం శిక్షణ తీసుకున్నప్పుడు రెండు జ్ఞాన దంతాలను తొలగించుకున్నట్లు వెల్లడించారు. గగన్‌యాన్ యాత్రకు ఎంపికైన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ నాయర్, అంగద్ ప్రతాప్‌లతో కలిసి తాజాగా బాంబే ఐఐటీలో మాట్లాడారు. “వ్యోమనౌకలో ఉన్నప్పుడు ఏవైనా అనారోగ్య, అత్యవసర సమస్యలు తలెత్తితే వాటిని ఎదుర్కొనేలా వ్యోమగాములకు ముందుగానే శిక్షణ ఇస్తారు. అయితే వ్యోమనౌకలో దంత సమస్యలకు శస్త్ర చికిత్సలు చేయడం కుదరదు. అందుకు అనుగుణంగానే అంతరిక్ష యాత్రలో వ్యోమగాములకు ఎలాంటి దంత సమస్యలు రాకుండా ముందే వారిని పరీక్షించి సిద్ధం చేస్తారు. ఇలానే.. నా శిక్షణలో నేను రెండు జ్ఞాన దంతాలు తీయించుకున్నాను. నాయర్‌కు మూడు దంతాలు తీశారు. ప్రతాప్‌కు నాలుగు పళ్లు తొలగించారు. మీరు గనక వ్యోమగాములు కావాలంటే మీ జ్ఞానాన్నివదులుకోవాల్సిందే” అని శుభాంశు శుక్లా చెప్పారు.
ఎయిర్ ఫోర్స్ నుంచి గగన్ యాన్ కు ఎంపిక
శుభాంశు శుక్లా భారత వైమానిక దళం (IAF)లో టెస్ట్ పైలట్ గా పని చేశారు. ఆ తర్వాత ఇస్రో (ISRO) గగన్‌యాన్ (వ్యోమగామి)కు సెలెక్ట్ అయ్యారు. 2006లో IAFలో ఫైటర్ పైలట్‌గా కమిషన్ గా ఎంట్రీ ఇచ్చారు. సుఖోయ్-30 MKI, మిగ్-21, మిగ్-29 వంటి విమానాలు నడిపారు. 2000 పైగా గంటల ఫ్లైయింగ్ అనుభవం ఉంది 2019లో గగన్‌యాన్ మిషన్ కోసం ఎంపికయ్యారు. రష్యాలో శిక్షణ పొందాడు. 2025లో ఆక్సియం మిషన్-4 (Axiom Mission 4)లో మిషన్ పైలట్‌గా పాల్గొని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. కమాండర్ పెగ్గీ విట్సన్ నేతృత్వంలో పోలండ్, హంగేరీ వ్యోమగాములతో కలిసి 18 రోజులు ISSలో గడిపారు. 60కి పైగా ప్రయోగాలు నిర్వహించారు. జులై 15, 2025న భూమికి తిరిగి వచ్చారు. రాకేశ్ శర్మ తర్వాత (1984) అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.





