
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లాలో మలేరియా నివారణ చర్యల్లో భాగంగా పంపిణీ చేసిన మాత్రలు వేసుకున్న అనంతరం ఏడేళ్ల బాలిక మృతి చెందిన ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది. కేసు దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుందో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిశితంగా పర్యవేక్షించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన విచారణపై న్యాయపరమైన పర్యవేక్షణ కొనసాగనుంది.
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో మలేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులు సెప్టెంబర్ 1న నివారణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గ్రామస్థులకు క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేశారు. మొత్తం 71 మందికి మందులు అందించినట్లు అధికారులు తెలిపారు.
మాత్రలు తీసుకున్న వారిలో రెండో తరగతి చదువుతున్న మాదివి జమున అనే ఏడేళ్ల కోయ గిరిజన బాలిక కూడా ఉంది. మందు వేసుకున్న కొన్ని గంటలకే ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది.
అదే సమయంలో మరో 52 మంది గ్రామస్థులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. పరిస్థితిని గమనించిన అధికారులు బాధితులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం 28 మందిని తెలంగాణలోని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స అనంతరం వారంతా కోలుకుని మరుసటి రోజే డిశ్చార్జ్ అయ్యారు.
బాలిక మృతితో పాటు పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మందులు, వాటి బ్యాచ్‌కు సంబంధించిన అంశాలతో పాటు ఇతర కారణాలపై కూడా అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక కోసం దర్యాప్తు అధికారులు ఎదురుచూస్తున్నట్లు కోర్టుకు తెలిపారు.
బాలిక మృతి, ఇతర గ్రామస్థుల అనారోగ్యానికి అసలు కారణం ఏమిటో నిర్ధారించడంలో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారనుంది. పంపిణీ చేసిన మందుల్లో ఏదైనా లోపం ఉందా? మందుల బ్యాచ్‌లో సమస్య ఉందా? లేక ఇతర కారణాలతో ఈ ఘటన జరిగిందా? అనే అంశాలపై నివేదిక ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే విచారణకు ఆదేశించారు. తాజాగా సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించి, దర్యాప్తును హైకోర్టు పర్యవేక్షించాలని ఆదేశించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఫోరెన్సిక్ నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగుచూసే అంశాల ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
also read: రష్మికపై ట్రోలింగ్.. విజయ్ దేవరకొండ ఘాటు స్పందన.. ‘అసలు పరిచయం లేకుండానే నిర్ణయిస్తారా?’