
క్రైమ్ మిర్రర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు మరణశిక్ష విధిస్తూ మీరట్ జిల్లా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా ఈ తీర్పును ప్రకటించారు. ఈ కేసు విచారణ గత సెప్టెంబర్ 30న పూర్తయింది. ముస్కాన్, సాహిల్ హత్యకు పాల్పడినట్లు తేలడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఇద్దరికీ మరణశిక్ష విధిస్తూ నిర్ణయం ప్రకటించింది. తీర్పు వెలువడిన సమయంలో జిల్లా జైలులో ఉన్న నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు.
అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ 2025 మార్చి 3న హత్యకు గురయ్యాడు. అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తమ వివాహేతర సంబంధానికి సౌరభ్ అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. హత్య అనంతరం సౌరభ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఒక నీలిరంగు డ్రమ్‌లో ఉంచారు. ఆ తర్వాత డ్రమ్‌లో సిమెంట్ పోసి మృతదేహాన్ని దాచిపెట్టారు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతో ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది.
13 నెలల్లోనే విచారణ పూర్తి
ఈ కేసులో గత ఏడాది జూలైలో విచారణ ప్రారంభమైంది. సుమారు 13 నెలల్లోనే విచారణ పూర్తవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసు విచారణలో భాగంగా 126 వాదనలు జరిగినట్లు సమాచారం. కోర్టు 22 మందికి పైగా సాక్షులను విచారించింది. పోలీసులు సమర్పించిన చార్జిషీటుతో పాటు ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించడంతో మరోసారి ఈ ఘటన వార్తల్లో నిలిచింది.
also read : పంచాయతీ ఎన్నికల వివాదం.. కొడుకు, కోడలిని హతమార్చిన తండ్రి