
పుణేలో వెలుగుచూసిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న యువకుడినే హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె స్నేహితులు చేతన్ చౌదరి, రితేష్ హంగేలపై పోలీసులు 5,053 పేజీల భారీ చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో హత్యకు ముందు జరిగిన ప్రణాళిక, నిందితుల కదలికలు, డిజిటల్ ఆధారాలకు సంబంధించిన పలు కీలక అంశాలను పోలీసులు చార్జిషీట్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
నెల రోజుల ముందే హత్యకు ప్లాన్?
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. కేతన్‌ను హత్య చేయాలనే ఆలోచనలో భాగంగా సియా గోయల్ ముందుగానే లోహగడ్ కోట ప్రాంతాన్ని పరిశీలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మే 31న కేతన్‌తో కలిసి ఆమె లోహగడ్ కోటకు వెళ్లిన సమయంలో.. అనంతరం అతడిని లోయలోకి నెట్టివేయాలని భావించిన ప్రాంతాన్ని పలు కోణాల్లో ఫొటోలు తీసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అనంతరం జూన్ 18న కేతన్‌ను మరోసారి అదే ప్రాంతానికి రప్పించినట్లు చార్జిషీట్లో వివరించారు. ఇందుకోసం నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించి అతడిని అక్కడికి రప్పించినట్లు పోలీసులు ఆరోపించారు. అక్కడే కేతన్పై దాడి జరిగిందని, సియా అతడిని నెట్టగా.. ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి కూడా దాడి చేయడంతో కేతన్ లోయలో పడిపోయినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
హత్యకు ముందు, తర్వాత టెక్నాలజీ వినియోగం
ఈ కేసులో డిజిటల్ ఆధారాలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారినట్లు సమాచారం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయిన ChatGPTను సియా ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారని చార్జిషీట్లో పేర్కొన్నారు.
కేతన్ తల్లికి క్షమాపణలు చెబుతూ సందేశం పంపేందుకు కూడా ఆమె ఏఐ సహాయం తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, హత్య అనంతరం ఎలా ప్రవర్తించాలి, పోలీసుల విచారణను ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాలపై కూడా ఆన్లైన్లో సమాచారం వెతికినట్లు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు.
క్రైమ్ సినిమాలు, పాడ్కాస్ట్లపైనా దృష్టి
నిందితులు హత్యకు సంబంధించిన సినిమాలు, క్రైమ్ మిస్టరీ కంటెంట్, పాడ్‌కాస్ట్‌లను పరిశీలించినట్లు కూడా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ అంశాలను కూడా కేసులో లభించిన డిజిటల్ ఆధారాలతో అనుసంధానించినట్లు తెలుస్తోంది.
ప్రమాదం కాదని తేల్చిన దర్యాప్తు
కేతన్ మరణించిన సమయంలో ఈ ఘటన తొలుత ప్రమాదంగా భావించారు. అయితే కుటుంబ సభ్యులకు కలిగిన అనుమానాలు, అనంతరం పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తుతో కేసు మలుపు తిరిగింది. కేతన్ మరణం వెనుక ముందస్తు ప్రణాళిక ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.
ప్రస్తుతం సియా గోయల్‌తో పాటు కేసులో నిందితులుగా పేర్కొన్న ఆమె స్నేహితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. 5,053 పేజీల చార్జిషీట్లో పొందుపరిచిన ఆధారాలు, డిజిటల్ డేటా, నిందితులపై ఉన్న ఆరోపణలు కోర్టు విచారణలో కీలకంగా మారనున్నాయి. కేసుపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.
also read: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 2006 నాటి కేసులో కీలక పరిణామం