
తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు వరుసగా 7 రోజుల సెలవులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ఉన్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అయితే పండుగల తేదీలు, వారాంతాలను దృష్టిలో పెట్టుకుని సెలవులపై మరోసారి పునఃసమీక్ష జరుగుతున్నట్లు సమాచారం.
విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. ఈ మూడు రోజులు ఇప్పటికే పండుగ సెలవులుగా ఉండటంతో పాటు, ముందువైపు వచ్చే రెండో శనివారాన్ని కూడా కలుపుకుంటే సెలవుల సంఖ్య పెరిగే అవకాశముంది. దీంతో విద్యార్థులకు మరింత వెసులుబాటు కల్పించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జనవరి 10 నుంచి 16 వరకు మొత్తం ఏడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. పండుగల సమయంలో గ్రామాలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు సూచిస్తున్నాయి.
ఇప్పటికే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 10 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఏపీలో తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణపై కూడా ప్రభావం చూపే అవకాశముందని విద్యావర్గాలు భావిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఒకే విధమైన సెలవులు ఉంటే విద్యార్థులు, తల్లిదండ్రులకు సౌలభ్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
అయితే తెలంగాణలో సెలవులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రం సంక్రాంతి పండుగకు దీర్ఘ సెలవులు వస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
ALSO READ: తెలంగాణలో మరో ఎన్నికలకు నగారా!





