
Rich Indians: భారతదేశం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైనా, ఇక్కడి జీవన పరిస్థితులు రోజు రోజుకు క్షీణిస్తుండటం చాలా మంది ధనికులను ఆలోచనలో పడేస్తోంది. ముఖ్యంగా పెద్ద నగరాల్లో గాలి నాణ్యత పడిపోవడం, కాలుష్యం ఊపిరి తీసుకోవడం కూడా కష్టమయ్యే స్థాయికి చేరుకోవడం, పెరుగుతున్న జనసాంద్రత, రోడ్లపై గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లు, భద్రతా సమస్యలు వంటి అంశాలు సంపన్న వర్గాన్ని స్వదేశంపై మక్కువ తగ్గించే పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్థిక నిపుణుడు అక్షత్ శ్రీవాస్తవ చేసిన విశ్లేషణ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.
అక్షత్ శ్రీవాస్తవ చెప్పిన దాని ప్రకారం.. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పన్ను లేదా వ్యాపార వాతావరణం కాదని, ఆర్థిక ప్రయోజనాల కన్నా తమ కుటుంబాలకు, ముఖ్యంగా తదుపరి తరాలకు ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన, సురక్షితమైన జీవనం అందించాలన్న అభిలాషే ప్రధాన కారణమని వెల్లడించారు. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే కేవలం GDP, పరిశ్రమల పెరుగుదల, పెట్టుబడులు మాత్రమే కాకుండా, ప్రజలకు అందుతున్న జీవన ప్రమాణాలు, శుభ్రమైన గాలి, శరీరానికి హాని చేయని నీరు, పిల్లలు పెరిగేందుకు అనుకూలమైన వాతావరణం కూడా సమానంగా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
ఉదాహరణకు ఢిల్లీ, ముంబయి వంటి నగరాలను తీసుకుంటే, అక్కడి కాలుష్యం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని నివేదికలు చెబుతున్నాయి. ఉదయం నిద్రలేవగానే సూర్యుడి కాంతి స్పష్టంగా కనిపించకుండా పొగమంచుతో కప్పేసిన వాతావరణం, మాస్క్ లేకుండా బయటకు వెళ్లడానికి ఇబ్బంది కలిగించే స్థాయి పొల్యూషన్.. ఇవన్నీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలు ఆరోగ్యంగా ఎదగలేరని భావించిన చాలామంది ధనికులు విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారని అక్షత్ తెలిపారు.
‘‘భారతదేశం ఎలా విడిచి వెళ్లాలి, ఏ దేశం పిల్లల భవిష్యత్తుకు సురక్షితం, ఎక్కడ మంచి విద్య, మంచి ఆరోగ్య సదుపాయాలు ఉంటాయి’’ వంటి ప్రశ్నలతో తనకు అధికంగా ప్రైవేట్ సందేశాలు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితి దేశంలో పెరుగుతున్న అసంతృప్తి, క్రమంగా క్షీణిస్తున్న సామాజిక సమతుల్యతను సూచిస్తోందని వ్యాఖ్యానించారు.
ఒక దేశంలో 2 శాతం ధనికులే అధికంగా ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తే, వారు దేశాన్ని విడిచిపెడితే దాని ప్రభావం మిగతా 98 శాతం ప్రజలపైనే పడుతుందని అక్షత్ స్పష్టంగా తెలిపారు. వారి వ్యాపారాలు, ఆఫీసులు, పెట్టుబడులు, దానాలు, ఉద్యోగావకాశాలు అన్నీ దేశ ఆర్థిక ప్రవాహంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆ స్థాయి వ్యక్తులు దేశం విడిచిపెడితే, అది భవిష్యత్తులో సామాజిక- ఆర్థికంగా భారీ నష్టమే అని ఆయన హెచ్చరించారు.
సామాన్య ప్రజల్లో కలిసే భావాలు కూడా ఇంటర్నెట్లో స్పష్టంగా కనిపించాయి. ‘‘కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలి, మైసూర్, ఉడిపి, కొచ్చి, నాగ్‌పూర్ వంటి చిన్న నగరాలు ఇప్పటికీ పరిశుభ్రంగా ఉన్నా.. పెద్ద నగరాల పరిస్థితి చూస్తే భయంకరంగా ఉంది’’ అని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ‘‘అభివృద్ధి అంటే కేవలం సంపద కాదు.. ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే అసలు అభివృద్ధి’’ అని మరికొందరు వ్యాఖ్యానించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణ, రోడ్లు, పారిశుధ్యం, భద్రత, గాలి నాణ్యతపై మరింత దృష్టి పెట్టాలని, అదే భారతదేశాన్ని వదిలి వెళ్లే వారికి తిరిగి చూసేలా చేయగలదని చాలా మంది పేర్కొంటున్నారు.





