
Rape Case: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాలు గ్రామంలో హోరాహోరీగా కొనసాగుతుండగా.. అదే సమయంలో ఓ యువతి జీవితాన్ని చీకట్లోకి నెట్టిన భయంకర నేరం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన 22 సంవత్సరాల యువతిని ఆమెకు పరిచయం ఉన్న యువకుడు మాటలతో నమ్మించి రైతు వేదిక వద్దకు తీసుకువెళ్లినట్లు సమాచారం. అక్కడ ఆమెకు మత్తు పదార్థం ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అత్యాచారం అనంతరం యువతికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అపస్మారక స్థితికి చేరింది. ఈ పరిస్థితిని గమనించిన నిందితుడు, అసలు విషయం బయటపడకుండా ఉండేందుకు ఆమె కుటుంబ సభ్యురాలికి ఫోన్ చేసి, ఎన్నికల విజయోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సౌండ్ వల్ల యువతి రైతు వేదిక వద్ద కుప్పకూలిపోయిందని చెప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ స్పృహ లేని స్థితిలో ఉన్న యువతిని స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా, పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
ఆర్ఎంపీ సూచన మేరకు కుటుంబ సభ్యులు యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో మృతదేహాన్ని తిరిగి రైతు వేదిక వద్దకు తీసుకొచ్చారు. తెల్లవారుజామున ఈ విషయం గ్రామంలో వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ రక్తస్రావానికి సంబంధించిన ఆనవాళ్లు, రక్తంతో మసకబారిన దుస్తులు కనిపించడంతో యువతిపై లైంగిక దాడి జరిగినట్లు అనుమానాలు మరింత బలపడ్డాయి.
గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువతిపై ఒకరికి మించి వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారా..? లేక మత్తు పదార్థం ఇచ్చిన కారణంగా ఈ దారుణం జరిగిందా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్సై వేణు సంఘటన స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు.





