
గత కొంతకాలంగా భారతదేశంలో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకులు, దేశం మీద విద్వేషాన్ని వెళ్లగక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వరుసలో భారత పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నాయుకుడి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ ముందు వరుసలో నిలబడి ఉండటం ఆందోళన కలిగించే విషయం. గతకొంత కాలంగా ఆయన ప్రవర్తన, మాట్లాడే మాటలు తీవ్రమైన ఫ్రస్టేషన్ లో ఉన్నారనే సంకేతాలను ఇస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉన్న ద్వేషాన్ని.. ఆయన ఏకంగా భారత్ మీదే ద్వేషంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. భరించలేనంత ద్వేషాన్ని దేశం మీద రుద్దాలని చూస్తున్నారు. భారత్ చేసే, భారతీయులు మాత్రమే చేయగలిగే, భారతీయులు నమ్మే ప్రతిదాన్ని ఆయన ద్వేషిస్తున్నారు. అడుగడుగున కించపరుస్తున్నారు. భారతీయ వ్యతిరేక వ్యక్తులు, దేశాల వ్యాఖ్యలను నిర్మోహమాటంగా సమర్థిస్తున్నారు. విదేశాల్లో జరిగే డిబేట్లలో పాల్గొన్నా.. భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఏ నాయకుడూ ఇలాంటి పని చేసిన దాఖలాలు లేవు. భారత సైన్యా పరాక్రమాన్ని ప్రశ్నించడం, భారత ఆర్థిక వ్యవస్థ మీద దాడి చేయడం, ఎన్నికల విధానాన్ని తప్పుబట్టడం, భారత్ తరఫున మాట్లాడే వారిని ద్వేషించడం, హిందూ మతంపై అక్కసు వెళ్లగక్కడం, చివరకు భారత్ లో నేపాల్ లాంటి ఆందోళనలు రావాలంటూ వ్యాఖ్యానించడం చూస్తుంటే ఆయన ఏం కోరుకుంటున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. సొంత దేశాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తి, రేపు దేశాన్ని ఎలా పాలిస్తారనే భావన ప్రజల్లోనూ కలుగుతోంది. ఆయన మాట్లాడే ప్రతి మాట జనాల్లో మరింత చులకన అయ్యేలా చేస్తోంది.
రోజు రోజుకు దిగజారుతున్న మానసిక పరివర్తన!
రాహుల్ గాంధీ మానసిక పరిస్థితి రోజులు రోజుకు మరింత దిగజారుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన మాటలు, ప్రవర్తన కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆయన లేవనెత్తే అంశం ఏంటి? దానికి ఆయన చూపిస్తున్న ఎగ్జాంపుల్స్ ఏంటి? అనే విషయంలోనూ ఓ క్లారిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజా ఓట్ల చోరీ గురించి ఓ హైడ్రోజన్ బాంబ్ వేయబోతున్నా, అంటూ పెట్టిన ప్రెస్ మీట్ లో 2022-2023లో అలంద్ నియోజకవర్గంలో ఓట్లు డిలీట్ చేసి, ఓట్ల చోరీకి పాల్పడ్డారు అని చెప్పుకొచ్చారు. నిజానికి అలంద్ లో నియోజకవర్గంలో ఎప్పుడూ గెలవని కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో విజయం సాధించింది. ఓట్ల చోరీ జరిగితే కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎలా గెలుపొందినట్లు? ఓట్లను డిలీట్ చేయడం అనేది సాధ్యమేనా? ఓట్ల చోరీకి సాఫ్ట్ వేర్ ఉపయోగించారని ఆరోపించారు? అది ఎంత వరకు సాధ్యం? అనేది విషయంలో క్లారిటీ ఉందా? ఒకవేళ ఓ బూత్ లెవల్ లో కొన్ని ఓట్లు డిలీట్ చేస్తే, అవి ఎందుకు తొలగించారు? ఎలా చేశారు? అనే విషయాన్ని ఇతర పార్టీ నాయకులు ప్రశ్నించరా? గుడ్డిగా డిలీట్ చేసుకుపోతే సైలెంట్ గా ఉంటారా? ఓట్లకు సంబంధించిన యాడింగ్, డిలీషన్ అనేది అన్ని పార్టీలకు తెలిసే కదా జరుగుతుంది? ఓటర్ల తుది జాబితా రావడానికి ముందు ఈసీ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటుంది కదా? తర్వాతే ఫైనల్ లిస్టు రిలీజ్ చేస్తారుగా? ఈ విషయం రాహుల్ కు తెలియదా?
వెనుకడుగు ఎందుకు వేస్తున్నట్లు?
తాజా ప్రెస్ మీట్ లో ఓట్ల చోరీ గురించి చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తారా? అని రాహుల్ గాంధీని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు, తన పని కోర్టుకు వెళ్లడం కాదు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడమేనని సమాధానం ఇచ్చారు. ఎన్నికల సంఘం పట్టించుకోని సమయంలో కోర్టుకు వెళ్లి కూడా ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టవచ్చు కదా? అంటే నో ఆన్సర్. ఎందుకు ఇంత క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు అనేది అర్థంకాని ప్రశ్న.
గెలిచిన చోట నో ఓట్ చోర్.. నో ఈవీఎం ట్యాంపరింగ్!
గమ్మతైన విషయం ఏంటంటే.. కాంగ్రెస్ గెలిచిన చోట ఓట్ చోరీ జరగదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. తెలంగాణలో, కర్నాటకలో అలాగే వర్ధిల్లింది. కాంగ్రెస్ ఓడిపోయిన చోట మాత్రమే ఓట్ చోరీ జరుగుతుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుంది. నిజానికి ఈవీఎంలను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఉన్న వీరప్ప మొయిలీ ఈవీఎంలను తప్పుబట్టడాన్ని పలు సందర్భాల్లో ఖండించారు. అనుమానాలు ఉంటే క్లియర్ చేసుకోవాలే తప్ప, అసలు ఈవీఎంలు వద్దని చెప్పడం సరికాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
భారత్ లో నేపాల్ తరహా విధ్వంసం జరగాలనుకుంటున్నారా?
నిజానికి నేపాల్ సహా ఇతర దేశాల్లో జరిగిన విధ్వంస కాండను చాలా మంది ఖండించారు. నిరసన పేరిట ప్రజా ఆస్తుల ధ్వంసాన్ని తప్పుబట్టారు. కానీ, మనదేశంలో కొంత మంది మేధావులు అక్కడి విధ్వంసాన్ని సమర్థిస్తున్నారు. కేంద్ర మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ గా పని చేసిన ఖురేషీ లాంటి మేధావులు ఏకంగా ప్రజాస్వామ్య పోరాటంగా అభివర్ణించారు. ఇక రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి నేపాల్ లాంటి తిరుగుబాటు భారత్ లోనూ వస్తుందన్నారు. అంతేకాదు, వచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలూ చేస్తున్నారు. ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జెన్ జెడ్ కలిసి రాజ్యాంగాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఓట్ చోరీని ఆపాలంటూ ఉపన్యాసాలు ఇస్తూ.. ఇన్ డైరెక్ట్ గా భారత్ లోనూ అలాంటి కల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా రాహుల్ గాంధీ, మోడీ మీది కోపాన్ని దేశం మీద పూసే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఏం అంశంలోనూ క్లారిటీ లేని తనను దేశ ప్రజలు కొద్ది కాలం తర్వాత పట్టించుకోవడం మానేస్తారని!