
-
ఇఎల్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన రాచకొండ బతుకమ్మ వేడుకలు
-
ఫ్లోరోసిస్ నిర్మూలనకు ముందుండి పోరాడుతా
-
శివన్నగూడెం రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి
-
—ఫౌండేషన్ చైర్మన్ ఇరిగదిండ్ల భాస్కర్
-
ఐతగోని నర్సింహ పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా సంబరాలు
-
ఆటపాటలతో సందడి చేసిన మహిళలు
మర్రిగూడ (క్రైమ్ మిర్రర్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని, ఇఎల్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాచకొండ బతుకమ్మ వేడుకలను, శుక్రవారం మర్రిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.
రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చిన మహిళలు, బతుకమ్మ పాటలు, ఆటపాటలతో కార్యక్రమ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ప్రతీకగా నిలిచే, బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడంతో మర్రిగూడ ప్రాంతంలో సందడి నెలకొంది.
-
ఫ్లోరోసిస్ పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా.. ఇరిగదిండ్ల భాస్కర్
ఇఎల్వి ఫౌండేషన్ చైర్మన్ ఇరిగదిండ్ల భాస్కర్ ఈ వేడుకల్లో పాల్గొని, మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు అందించడంతో పాటు మహిళల్లో ఐక్యతాభావాన్ని పెంపొందించేందుకు, ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
రాచకొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా మునుగోడు ప్రాంతాన్ని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న, ఫ్లోరోసిస్ సమస్య నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమికొట్టేందుకు ముందుండి పోరాటం చేస్తానని, ఈ ఉద్యమంలో ప్రజలు కూడా భాగస్వాములై తనతో కలిసి అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
శివన్నగూడెం రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు తాగునీరు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంత ప్రజలకు, శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బతుకమ్మ వేడుకల వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలనే ఆకాంక్షను భాస్కర్ వ్యక్తం చేశారు. అనంతరం వేడుకల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు.
-
–ఐతగోని నర్సింహ పర్యవేక్షణలో, సమన్వయంతో వేడుకలు
ఇఎల్వి ఫౌండేషన్ మండల కన్వీనర్ ఐతగోని నర్సింహ పర్యవేక్షణలో, బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించబడ్డాయి. బతుకమ్మ కార్యక్రమ ఏర్పాట్లలో చురుకుగా వ్యవహరిస్తూ మహిళలు, ఫౌండేషన్ సభ్యులు, స్థానిక ప్రజలను సమన్వయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఫౌండేషన్ చైర్మన్ ఇరిగదిండ్ల భాస్కర్ వెంట ఉంటూ, మండల స్థాయిలో ఫౌండేషన్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో నర్సింహ కృషి చేస్తున్నారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయడంతో పాటు, కార్యక్రమం సంప్రదాయబద్ధంగా, ఉత్సాహభరితంగా సాగేందుకు పర్యవేక్షించారు.
మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా మహిళల్లో పండుగ ఉత్సాహం వెల్లివిరియగా, స్థానికంగా పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ సామూహికంగా పండుగలను నిర్వహించడం ద్వారా సామాజిక ఐక్యత మరింత బలపడుతుందని కార్యక్రమంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కమ్మచించు వెంకటేష్, కళ్లెట్ల లింగయ్య, ఇఎల్వి ఫౌండేషన్ సభ్యులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.