
-
కేంద్ర సర్వీసుల్లో పూర్తయిన డిప్యూటేషన్
-
తిరిగి తెలంగాణ క్యాడర్‌లోకి..
-
కీలక పోస్టింగ్ దక్కే ఛాన్స్ లేదు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ చుట్టూ సరికొత్త చర్చ మొదలైంది. కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్ పూర్తిచేసుకుని తెలంగాణ క్యాడర్ కు ఆయన ఇటీవల తిరిగి వచ్చారు. గతంలో గులాబీ పార్టీ హయాంలో ఎక్సైజ్ అండ్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా పని చేశారు.
ఆ సమయంలోనే టాలీవుడ్ ప్రముఖులను వరుసగా విచారించి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అప్పట్లో ఆయన పేరు మార్మోగిపోయింది. అయితే కేంద్ర సర్వీసుల్లోకి డిప్యూటేషన్ పై వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన తెలంగాణ క్యాడర్ కు తిరిగి రావడంతో డ్రగ్స్ కేసుల ఫైళ్లు మళ్లీ తెరుచుకుంటాయని.. పాత దర్యాప్తు తెర పైకి వస్తుందని కొందరు భావిస్తున్నారు.
కానీ అందుకు భిన్న పరిస్థితులు ఉన్నాయి. అప్పట్లో ఆ కేసులను అర్ధాంతరంగా వదిలేసి ఆయన కేంద్ర సర్వీస్‌లకు వెళ్లడం, సరైన ప్రాసిక్యూషన్ ఆధారాలు లేకపోవడంతో కోర్టులు కూడా నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడం జరిగిపోయింది. న్యాయపరంగా మూతపడిన ఆ అధ్యాయాన్ని మళ్లీ తెరిచే అవకాశాలు లేవనేది బహిరంగ రహస్యం.
-
ప్రాధాన్య పోస్టుకు అవకాశం లేదు..
ప్రస్తుత ప్రభుత్వంలో అకున్ సబర్వాల్ కు ప్రాధాన్యత కలిగిన పోస్ట్ దక్కే అవకాశం లేదనేది ఒక వాదన. ఆకున్ సబర్వాల్ సతీమణి, సీనియర్ ఐపీఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ గత కెసిఆర్ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన ఆఫీసర్ గా చక్రం తిప్పారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంటూ పదేళ్లపాటు గులాబీ పార్టీ పాలనలో.. కీలక నిర్ణయాలను ప్రభావితం చేసిన ముద్ర ఆమెపై ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఈ ప్రభుత్వంతో కలిసి పని చేయలేకపోయారు. కీలక బాధ్యతలు ఇచ్చిన నెరవేర్చలేకపోయారు. కంచ గచ్చిబౌలి వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు చేసి ఉండలేక సెలవు పై వెళ్ళిపోయారు.
-
గులాబీ పార్టీతో సంబంధాలు..
స్మిత సబర్వాల్ కు గులాబీ పార్టీ ప్రభుత్వంతో.. అప్పటి ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అటువంటి ఆమె భర్తకు రేవంత్ సర్కార్‌లో అత్యంత కీలకమైన శాంతిభద్రతల బాధ్యతలు గానీ.. పవర్ఫుల్ అండ్ ఫోర్స్ మెంట్ విభాగాన్ని గాని అప్పగిస్తుందని భావించడం అత్యాశ అవుతుంది.
రేవంత్ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి గత ప్రభుత్వ కోటరీ లో ఉన్న అధికారులను పక్కన పెడుతూ వస్తోంది. పైగా డ్రగ్స్ నిర్మూలన కోసం కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే టీజీ న్యాబ్ వంటి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి.. కొత్త అధికారులతో దూకుడుగా వ్యవహరిస్తోంది.
బ్యూరోక్రసీ వ్యవస్థలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం అనేది సర్వసాధారణం. కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి మాత్రం అత్యంత స్పష్టంగా ఉంది.
గత పాలకులతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి కీలక పోస్టుల్లో ఉండకుండా చేయాలన్నది ఒక వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు అకున్ సబర్వాల్ కు అప్రా ధాన్య పోస్టులోనే నియమిస్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..