
-
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం పార్టీల అన్వేషణ
-
ముందుగానే ప్రకటించిన అధికార కాంగ్రెస్
-
బిజెపి, బిఆర్ఎస్ లపై ఒత్తిడి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ ముందడుగు వేసింది. అధికార పార్టీగా తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది. ఈ విషయంలో భారత రాష్ట్ర సమితి తో పాటు భారతీయ జనతా పార్టీలో వెనుకబాటు కనిపిస్తోంది. ఆ రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి బిజెపి ఎమ్మెల్సీ టికెట్ కోసం నేతల మధ్య పోటీ నెలకొంది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పేరు చుట్టూ చర్చ నడుస్తోంది. బలమైన అభ్యర్థుల కోసం భారత రాష్ట్ర సమితి అన్వేషిస్తుంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో మిగతా రెండు పార్టీల శ్రేణుల్లో ఒక రకమైన అయోమయం నెలకొంది. పార్టీ బలంతో పాటు అభ్యర్థి ఇమేజ్తో ఈ ఎన్నికలు ముడిపడి ఉన్నాయి.
-
అప్పుడే ఓటర్ల నమోదు..
అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జ్ లకు బాధ్యతలు అప్పగించి.. పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాలను ప్రచారంలోకి తీసుకెళ్తూ సన్నద్ధం అవుతుంది.
-
బిజెపికి ప్రతిష్టాత్మకం..
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది బిజెపి ఆలోచన. అందుకే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇతర ముఖ్య నేతలు కూడా టికెట్ ఆశిస్తుండడంతో అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర నాయకత్వం అభ్యర్థుల పేర్లతో నివేదికలు కేంద్ర నాయకత్వానికి పంపినట్లు సమాచారం. మరోవైపు వరుస ఎన్నికల పరాజ్యాల తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుని తిరిగి పుంచుకోవాలని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది.
అయితే విస్తృతమైన నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించగల, పట్టభద్రుల్లో మంచి గుర్తింపు ఉన్న అభ్యర్థుల కోసం ఆ పార్టీ అన్వేషిస్తుంది. క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే అభ్యర్థుల ఎంపికలో జాప్యంతో మరింత అయోమయం నెలకొంది.
-
చరిష్మ నేతల కోసం…
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అభ్యర్థుల విషయంలో పార్టీతో పాటు అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్ కూడా ముఖ్యం. ఎందుకంటే అక్కడ సాధారణ ఓటర్లు ఉండరు. ఉండేది పట్టభద్రులు, ఉద్యోగులు కాబట్టి వారి ఆలోచన విధానం వేరేలా ఉంటుంది.
ముఖ్యంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలను ఎన్నుకుంటారు ఈ ఎన్నికల్లో. అందుకే అన్ని పార్టీలు మంచి ఇమేజ్ కలిగిన నాయకుల కోసం అన్వేషిస్తున్నాయి. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.