
క్రైమ్ మిర్రర్ : రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో తండ్రీకొడుకుల మధ్య తలెత్తిన వివాదం విషాదాంతమైంది. కోపంతో ఊగిపోయిన తండ్రి కారుతో ఢీకొట్టి తన కుమారుడు, కోడలిని హతమార్చిన ఘటన చురు జిల్లాలోని తారానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చురు జిల్లాలోని చంగోయ్ గ్రామానికి చెందిన రామచంద్ర రానున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాడు. అయితే తండ్రి నిర్ణయాన్ని కుమారుడు రవీంద్ర తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ అంశంపై కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన రోజు రాత్రి కూడా తండ్రీకొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో మనస్తాపానికి గురైన రవీంద్ర అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి సమీపంలోని వేబ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. అతడిని తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు భార్య మహీంద్ర అక్కడికి వెళ్లింది. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న రామచంద్ర తన కారుతో వారిద్దరినీ ఢీకొట్టి తొక్కించాడు. ఈ ఘటనలో రవీంద్ర, మహీంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న తారానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు రామచంద్రను అదుపులోకి తీసుకున్నారు. రవీంద్ర మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ అంశమే కాకుండా, గతంలోనూ తండ్రీకొడుకుల మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఒక కుటుంబంలో నెలకొన్న వివాదం చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొనడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
also read :డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి హత్య కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు అరెస్ట్!