
-
సృజనాత్మక దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయం
-
అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూత
-
శోకసంద్రంలో సినీ లోకం
-
ఎన్నెన్నో అద్భుత సినిమాలకు దర్శకత్వం
క్రైమ్ మిర్రర్,సినిమా: ప్రముఖ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక మార్కు చూపించుకున్నారు సృజనాత్మక దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. 9 పదుల వయసు దాటినా ఆయనలో సృజనాత్మకత తగ్గలేదు. ఇటీవల నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగీతం అనే చిత్రాన్ని తెరకెక్కించి.. 94 ఏళ్ల వయసులోనే మెగా ఫోన్ పట్టి ప్రపంచంలో అత్యంత వయోదికుడైన దర్శకుడిగా అరుదైన రికార్డు సృష్టించారు. ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి.
దిగ్గజ దర్శకుల వద్ద సహాయకుడిగా..
ఎన్నెన్నో కష్టాలు పడి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు సింగీతం శ్రీనివాసరావు. దర్శకత్వం రంగంలోకి అడుగు పెట్టకముందే ఆయన దిగ్గజ దర్శకుడు కె.వి.రెడ్డి దగ్గర మాయాబజార్, జగదేకవీరుని కథ వంటి అమర కావ్యాలకు సహదర్శకుడిగా వ్యవహరించారు. సోషల్, మైథాలజీ, జానపదం.. ఇలా ఏ జోనర్ అయినా అలవోకగా సినిమాను తెరకెక్కించగల నేర్పరి ఆయన. 1972లో ‘నీతి నిజాయితీ’ చిత్రంతో స్వతంత్ర దర్శకుడిగా మారినప్పుడే ఆయన తన విలక్షణ తను చాటుకున్నారు. అప్పట్లో ఆ సినిమా ఒక సెన్సేషన్. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు తో పిల్ల జమిందార్, సంగీత్ సామ్రాట్, వసంత గీతం వంటి గొప్ప చిత్రాలను అందించారు.
విలక్షణ సినిమాలు..
కమర్షియల్ సినిమాను నమ్ముకోలేదు. తనదైన శైలిలో విలక్షణ సినిమాలు తీశారు. కన్నడలో వరుణ్ పట్నాయక్ కాంబినేషన్లో వరనటుడు, డాక్టర్ రాజ్ కుమార్ తో జ్వాలాముఖి, భాగ్యద లక్ష్మీ బారమ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీశారు. రాజ్ కుమార్ కుమారులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ లను వెండితెరకు పరిచయం చేసింది కూడా సింగితం శ్రీనివాసరావే. శబ్దానికే ప్రాణం పోసే శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం వల్ల ఆయన సినిమాల్లో సంగీతం ఒక ప్రత్యేక పాత్ర పోషించేది.
కమల్ తో హిట్ కాంబినేషన్..
భారతీయ చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సునామీలు సృష్టించాయి. అమావాస్య చంద్రుడుతో మొదలైన వీరి బంధం వెండితెరపై అద్భుతాలు సృష్టించింది. అసలు మాటలే లేకుండా కేవలం హావభావాలు, నేపద్య సంగీతంతో నవ్వించి, ఏడిపించి, ఆలోచింపజేసింది పుష్పక విమానం. ఒక ఎవర్ గ్రీన్ సంచలనం. అసలు టెక్నాలజీ లేని రోజుల్లో కమల్ హాసన్ ను పొట్టివాడిగా చూపిస్తూ తీసిన సినిమా అపూర్వ సోదరులు కడుపుబ్బ నవ్వించింది ప్రేక్షకులను. నలుగురు కమల్ హాసన్ లతో కామెడీ పండించిన మైఖేల్ మదన కామరాజు ఎవర్గ్రీన్ సినిమా గాని నిలిచిపోయింది.
భవిష్యత్తును ఆలోచించే…
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఆలోచన ఎప్పుడూ తన కాలం కంటే కొన్ని దశాబ్దాలు ముందుండేది. 1991లో నందమూరి బాలకృష్ణ తో ఆయన తీసిన ఆదిత్య 369 భారతదేశ చిత్ర పరిశ్రమలోనే ఒక అపూర్వ చిత్రం. కృష్ణదేవరాయల కాలానికి, భవిష్యత్తులో భూమిపై మనసులు ఆహారాన్ని క్యాప్సిల్స్ రూపంలో తీసుకునే ఆధునిక కాలానికి మధ్య బ్యాలెన్స్ చేస్తూ.. ఆయన చూపిన డైరెక్షన్ విజన్ అద్భుతం. ఒక జానపద కళకు సరికొత్త ఊపిరిలు ఊదుతూ తీసిన భైరవద్వీపం, సుధా చంద్రన్ జీవిత ఆధారంగా తీసిన మయూరి, ఉపాధి పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై తీసిన మగళీర్ మట్టుమ్, మేడం చిత్రాలు సామాజిక స్పృహకు నిదర్శనాలు.. అటువంటి ప్రతిభ గల దర్శకుడు మృతి చెందడం నిజంగా బాధాకరం.