
Nidhi Agarwal: ప్రభాస్‌తో కలిసి ‘ది రాజాసాబ్’ సినిమాలో నటిస్తూ మరోసారి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్న నిధి అగర్వాల్ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పారు. ప్రభాస్-నిధి కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా జనవరి 9న విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రమోషన్లలో భాగంగా నిధి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. రాజాసాబ్ తనకు ఓ ప్రత్యేక అనుభవంగా నిలిచిపోతుందని ఆమె స్పష్టం చేశారు.
ఈ సినిమాలో ప్రతి పాత్రకు సమాన ప్రాధాన్యం ఉంటుందని నిధి చెప్పారు. ప్రభాస్ ఎత్తు 6.2 అడుగులు కాగా, తాను 5.7 అడుగులేనని, ఆయన హైట్‌ను బ్యాలెన్స్ చేయడం కోసం పెద్ద హీల్స్ వేసుకోవడమే కాకుండా యాపిల్ బాక్స్‌లపై నిలబడి షూటింగ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. సహనా సహనా పాటను ప్రేక్షకులు తెరపై పూర్తిగా కొత్తగా చూస్తారని, ఈ పాటలో కాస్ట్యూమ్స్ చాలా కలర్‌ఫుల్‌గా, విజువల్‌గా అద్భుతంగా ఉంటాయని చెప్పారు. నిర్మాత సినిమా విషయంలో ఏ దశలోనూ రాజీ పడలేదని, ప్రతీ ఫ్రేమ్ క్వాలిటీగా కనిపిస్తుందని నిధి వివరించారు.
ప్రభాస్ గురించి మాట్లాడిన నిధి ఆయనను తెరపైనే కాదు.. నిజజీవితంలోనూ అత్యంత స్వీట్ పర్సన్‌గా అభివర్ణించారు. తన కెరీర్‌లో అంత మంచి మనసున్న వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదని చెప్పారు. ప్రభాస్ అతిథి మర్యాదలు తనను బాగా ఆకట్టుకున్నాయని, షూటింగ్ సమయంలో ఇంటి నుంచి ప్రత్యేకంగా భోజనం తెప్పించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని అన్నారు. స్టార్ హోదాలో ఉన్నప్పటికీ ఆయన చాలా సింపుల్‌గా ఉంటారని నిధి ప్రశంసించారు.
తన వ్యక్తిగత జీవితంపై కూడా నిధి స్పందించారు. షూటింగ్ విరామాల్లో కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతానని, ధ్యానం చేసుకోవడం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. సామాజిక సేవలోనూ పాల్గొంటానని, అయితే వాటిని ప్రచారం చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. విదేశాల్లో షూటింగ్‌కు వెళ్లినప్పుడు కూడా చిన్న గ్యాస్ సిలిండర్‌ను వెంట తీసుకెళ్లి, ప్రతిరోజూ టిఫిన్, డిన్నర్‌ను తానే వండుకుంటానని చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
రాజాసాబ్ విడుదల తర్వాత తన అప్‌కమింగ్ ప్రాజెక్టుల వివరాలను వెల్లడిస్తానని నిధి తెలిపారు. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నానని, ఇతర భాషల్లోనూ కొన్ని ప్రాజెక్టులకు సైన్ చేశానని చెప్పారు. 2026 సంవత్సరం మొత్తం తనకు చాలా బిజీగా ఉండబోతుందని, ఓటీటీ సినిమాలంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని వెల్లడించారు. మంచి కథ ఉంటే డైరెక్ట్ ఓటీటీ ప్రాజెక్ట్‌లు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
2025 సంవత్సరం తన జీవితంలో రెండు మరపురాని అనుభవాలు ఇచ్చిందని నిధి భావోద్వేగంగా చెప్పారు. ఒకటి రాజాసాబ్ షూటింగ్ కాగా, మరొకటి ‘హరి హర వీరమల్లు’ ప్రచార సమయంలో పవన్ కల్యాణ్ తనను ప్రశంసించడమని తెలిపారు.
ALSO READ: కాసేపట్లో మ్యాచ్.. గ్రౌండ్‌లోనే ప్రాణాలు విడిచిన కోచ్





