
Isro New Satellite: భారత వాతావరణ విభాగం(IMD) ఇకపై వాతావరణ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయబోతోంది. పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టబోతోంది. వర్షాలు, తుపాన్లు, ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఇప్పుడున్న టెక్నాలజీతో అంత కచ్చితంగా అంచనా వేయలేకపోతోంది. వైపరీత్యాలపై కచ్చితమైన ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రతిఏటా పెద్ద మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఐఎండీ వాతావరణ అంచనాల్లో కచ్చితత్వాన్ని మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇస్రో సహకారంతో ఫోర్త్ జెనరేషన్ ఇన్ శాట్ సిరీస్ ఉపగ్రహాలను రూపొందించి నింగిలోకి పంపబోతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1,800 కోట్లు కేటాయించింది.
రెండు స్వదేశీ ఉపగ్రహాలతో సమాచార సేకరణ
ప్రస్తుతం ఐఎండీ ఇన్ శాట్-3డీఆర్, ఇన్ శాట్-3డీఎస్ తోపాటు యూరప్ కు చెందిన ఈయూ మెట్ శాట్, మెటాప్ బీ/సీ, ఓషన్ శాట్-3 ఉపగ్రహాలను ఉపయోగించి వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటున్నది. ఇస్రో రూపొందించిన ఇన్ శాట్-3డీఆర్‌ను 2016 సెప్టెంబరు 8న ప్రయోగించారు. వాతావరణ అంచనాలు, ప్రకృతి వైపరీత్యాల ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేలా రూ.480 కోట్ల ఖర్చుతో 2024 ఫిబ్రవరి 17న ఇన్ శాట్-3డీఎస్ ను ప్రయోగించారు. అయితే, హై రిజల్యూషన్ డేటా, ఉపగ్రహ ఆధారిత సాధనాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో కుండపోత వర్షాల, ఉరుములను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యాధునిక సెన్సర్లతో ఇన్ శాట్-4 సిరీస్ ఉపగ్రహాల అభివృద్ధికి ఐఎండీ, ఇస్రో కలసి పనిచేస్తున్నాయి. ఇవి అందించే ఫోటోలతో తుపాన్లు, భారీ వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే అంచనా వేసి, సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మారుమూల ప్రాంతాల్లోనూ వాతావరణ పర్యవేక్షణ మరింత ఈజీ కానుంది. సులభతరమవుతుంది.