
-
12న షెడ్యూల్
-
తరువాత ఎంపీటీసీలు, జడ్పిటిసి లకు..
-
చివరిగా పంచాయితీలకు
-
సన్నాహాలు మొదలుపెట్టిన ఎన్నికల సంఘం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కు దాదాపు ముహూర్తం ఫిక్స్ అయింది. సుప్రీం కోర్టులో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం వెలువడిన వెంటనే షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం తుది కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్ల పైన అంచనాలు సిద్ధం అయినట్లు సమాచారం.
రాజకీయంగా కూటమి, వైసిపి ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలపై మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దాదాపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు.
-
సుప్రీం తీర్పు వచ్చిన వెంటనే..
ముందుగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 12 నగరపాలక సంస్థలతోపాటు 100కు పైగా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వివిధ న్యాయపరమైన చిక్కుళ్ళు వీడాయి. హైకోర్టు కేసులను కొట్టివేసింది.
అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన పిటిషన్ కూడా కొట్టివేయడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపై సుప్రీం కోర్టులో తీర్పు వెలువడిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు.
-
ఒకే విడతలో..
ఈ నెల 12న ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అందుకు సంబంధించి పక్కా ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పట్టణ స్థానిక సంస్థలకు ఒకే విడతలు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది ఎన్నికల సంఘం.
మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అటు తరువాత చివరిగా పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించి స్థానిక ప్రక్రియ ముగించాలన్న కోణంలో ఆలోచిస్తోంది ప్రభుత్వం. శుక్రవారం సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
-
స్పష్టమైన ఆదేశాలు..
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఎస్పీలతో సమీక్షలు జరిపారు. ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ పై జిల్లాల యంత్రాంగాలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎన్నికల వాతావరణం మొదలైనట్టే.