
FIR For Feeding Pigeons: జంతు ప్రేమికులకు హైకోర్టు షాకిచ్చింది. ఇకపై పబ్లిక్ లో పావురాలకు తిండిపెడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. తాజాగా ఓ వ్యక్తి పావురాలకు తిండిపెట్టి కేసులో చిక్కుకున్నాడు. అయితే, ఈ ఘటన జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కాదు. మహారాష్ట్రలోని ముంబైలో.
ముంబై హైకోర్టు కీలక ఆదేశాలు
జూలై 31న ముంబై హైకోర్టు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎమ్‌సీ)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ ప్రాంతాల్లో పావురాలకు తిండిపెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వారిపై క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పింది. ముంబై హైకోర్టు ఆదేశాల ప్రకారం.. పబ్లిక్, చారిత్రక ప్రదేశాల్లో పావురాలకు తిండిపెట్టడం నిషేధం. పావురాల కారణంగా ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయని హైకోర్టు వెల్లడించింది. ప్రజల ఆరోగ్యం, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త రూల్ గురించి ప్రజలకు తెలియక..
తాజా నిబంధన గురించి ప్రజలకు తెలియకపోవడంతో చిక్కుల్లో పడుతున్నారు. తాజా ఓ వ్యక్తి స్కూటీపై ఎల్‌జీ రోడ్డులోని ఖాబూతర్ఖానా దగ్గరకు వచ్చాడు. సంచుల్లో తెచ్చిన దానాను అక్కడి పావురాలకు వేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలిస్తున్నారు. కొత్త రూల్ తెచ్చిన తర్వాత పావురాలకు తిండి పెట్టి.. కేసులో చిక్కుకున్న మొదటి వ్యక్తి అతడే. అయితే, ఈ రూల్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు పలువురు.
Read Also: కాలువలోకి దూసుకెళ్లిన డొలేరో వాహనం, 11 మంది స్పాట్ డెడ్..