
-
కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
-
తెలంగాణ సోనా, జైశ్రీరామ్ రకాల బియ్యం ఎగుమతికి మార్గం సుగమం
-
సుదీర్ఘ చరిత్ర ఈ సహకార సొసైటీ సొంతం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ మరోసారి అంతర్జాతీయ ఖ్యాతి సొంతం చేసుకుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూర్ సహకార సొసైటీ ఇప్పుడు అరుదైన ఘనతను దక్కించుకుంది.
ములకనూరు సహకార సొసైటీ బియ్యం ఇప్పుడు అమెరికా వరకు చేరనుంది. తెలంగాణ సోనా, జైశ్రీరామ్ రకాల బియ్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
15 సంవత్సరాలుగా బ్రాండింగ్ చేసి అమ్ముతున్న ఈ సొసైటీ ద్వారా.. రాష్ట్రవ్యాప్తంగా 51 కేంద్రాల ద్వారా ఏటా 25 కోట్ల రూపాయల విలువైన బియ్యం విక్రయిస్తోంది. స్థానికంగా జైశ్రీరామ్ కిలో 80 రూపాయలు కాగా.. తెలంగాణ సోనా 70 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇవే బియ్యం అమెరికాలో కిలో 200 రూపాయల వరకు ధర పలికే అవకాశం ఉంది.
-
సేంద్రీయ సాగు విధానంతో..
పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేసే ధాన్యం ద్వారా ఈ బియ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. క్రిమిసంహారక మందులు వాడని నాణ్యమైన బియ్యం కావడంతో ప్రవాస తెలుగువారు ములకనూరు సహకార సొసైటీ బియ్యాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు.
ఆ సొసైటీ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నేతృత్వంలో అమెరికా సంస్థ హార్వెస్ట్ లింక్ తో ఒప్పందం జరిగింది. విశాఖపట్నం పోర్టు ద్వారా మొదటి విడతగా 25 టన్నుల బియ్యాన్ని పంపాలని నిర్ణయించారు. కంటైనర్ అనుమతి రాగానే రెండు నెలల్లో ఎగుమతి మొదలవుతుంది. ఏటా 100 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
-
ప్రవాస తెలుగు వారి కోరికతో..
ముల్కనూరు బియ్యానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి బ్రాండ్ ఉంది. ఇప్పుడు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఎక్కువగా ఈ బ్రాండ్ బియ్యం కోరుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టడం తెలంగాణ రైతులకు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
సహకార రంగానికి ఇది ఒక ఊపు. నాణ్యత, బ్రాండింగ్, ఎగుమతి అనుమతులు కలిసి వస్తే తెలంగాణ బియ్యం ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉంది. అదే జరిగితే రైతులకు సైతం ఎంతో మేలు జరిగినట్టే.
దాదాపు ఏడు దశాబ్దాల కిందట..
కాగా ములకనూరు సహకార సొసైటీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1956లో దివంగత కలిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి నేతృత్వంలో.. కేవలం 373 మంది సభ్యులు.. 200300 రూపాయల వాటా ధనంతో ఈ సొసైటీ ప్రారంభం అయింది. తొలి 14 సంవత్సరాలు ఆయన ఇంటి నుంచి నడిచింది.
ప్రస్తుతం 14 గ్రామాల్లో 7వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. 150 మంది సిబ్బందితో నడుస్తోంది. వేట నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేస్తూ.. దాదాపు 0 ఎంపీలతో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంది.
రైతులకు పంట రుణాలు, విత్తనాలు, నిల్వ సౌకర్యాలు, బోనస్, వృద్ధాప్య పింఛన్ వంటి సేవలు కూడా అందిస్తోంది. అంతర్జాతీయ బ్రాండ్ లభిస్తుండటంతో ఈ సొసైటీ సేవలు మరింత విస్తృతం అయ్యే అవకాశం ఉంది.