
హైదరాబాద్ శివారులోని మేడిపల్లిలో భారీ దోపిడీ కలకలం రేపింది. టాటా గ్రూప్‌కు చెందిన క్యారెట్‌లేన్ ఆభరణాల షోరూంను టార్గెట్ చేసిన దుండగులు అత్యంత పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడ్డారు. కేవలం 11 నిమిషాల్లో సుమారు రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి వద్ద ఈ ఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున 4:07 గంటల సమయంలో మాస్కులు ధరించిన ఏడుగురు వ్యక్తులు షోరూంకు చేరుకున్నారు. ముందుగా షోరూం బయట ఉన్న సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థకు సంబంధించిన వైర్లను కట్ చేశారు. అనంతరం ఇనుప రాడ్ల సాయంతో షట్టర్ తాళాలను ధ్వంసం చేశారు.
షట్టర్ తెరిచిన తర్వాత నిందితుల్లో ఒకరు అద్దాన్ని పగలగొట్టి షోరూం లోపలికి వెళ్లాడు. మిగిలిన ఆరుగురు బయటే ఉండి పరిసరాలను గమనిస్తూ కాపలా కాశారు. లోపలికి వెళ్లిన వ్యక్తి అత్యంత వేగంగా చోరీకి పాల్పడ్డాడు. దాదాపు ఐదు నిమిషాల్లోనే 580 బంగారు ఆభరణాలను రెండు బ్యాగుల్లో సర్దుకుని బయటకు వచ్చాడు. అనంతరం ఏడుగురు కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం 4:18 గంటలకు నిందితులు షోరూం పరిసరాలను విడిచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
ఉదయం 7 గంటల సమయంలో వాచ్‌మ్యాన్ షోరూం షట్టర్ తెరిచి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఫ్రాంచైజీ యజమాని సుబ్రహ్మణ్యంకు సమాచారం అందించాడు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ లభించిన ఆధారాలను సేకరించడంతో పాటు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
చోరీ జరిగిన తీరు, నిందితులు తక్కువ సమయంలోనే లక్షల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లిన విధానం చూస్తే ముందుగానే రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు యువకులై ఉండొచ్చని, బిహార్‌కు చెందిన ముఠా ప్రమేయం ఉండే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల షోరూంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు ఉద్యోగాలు మానేసిన విషయం కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వారి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
also read: తెలంగాణలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఇద్దరు మహిళా అధికారులు అరెస్ట్