
2018లో విడుదలై యువతను ఆకట్టుకున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషారు’ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘హుషారు-2’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్లో వినోదం మరింత ఎక్కువగా ఉంటుందని, అలాగే కథలో మ్యాడ్నెస్ కూడా కొత్త స్థాయిలో ఉండబోతుందని చిత్రబృందం చెబుతోంది.
ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంథోని, దినేష్ తేజ్, శశిధర్ కోచర్లకోట తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువతను టార్గెట్ చేసేలా కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ కూడా ఆసక్తిని పెంచుతోంది. ట్రక్కు, పాము, తాబేలు, బంగారు నగల పెట్టె వంటి విభిన్న అంశాలను ఒకే ఫ్రేమ్‌లో చూపిస్తూ అమృత మథనం కాన్సెప్ట్‌ను గుర్తుచేసే విధంగా పోస్టర్‌ను డిజైన్ చేశారు. దీంతో ఈ సీక్వెల్ కథలో ఎలాంటి కొత్త ప్రయోగాలు ఉండబోతున్నాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇప్పటికే ‘హుషారు-2’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘హుషారు’ తరహాలోనే సీక్వెల్ కూడా యువతను, ముఖ్యంగా కామెడీ, ఫన్ ఎంటర్టైన్మెంట్ను ఇష్టపడే ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.
also read: జాన్వీ కపూర్‌పై ఏఐ మార్ఫింగ్ వీడియో.. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు