
ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ త్వరలో ఓ సరికొత్త పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. వెండితెరపై తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు బిజినెస్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ది గేమ్ ఛేంజర్స్: మిడిల్ ఈస్ట్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ కార్యక్రమానికి మాధవన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు నిర్మాణ సంస్థ ఆప్టిమిస్టిక్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా వెల్లడించింది.
స్టార్టప్ ప్రపంచానికి సంబంధించిన అంశాలతో ఈ షో రూపొందుతోంది. వివిధ దేశాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ ఫౌండర్లు ఇందులో పాల్గొననున్నారు. తమ వ్యాపార ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలను అంతర్జాతీయ స్థాయి ఇన్వెస్టర్ల ప్యానల్ ముందు వివరించే అవకాశం వారికి లభించనుంది.
ప్రత్యేకంగా పశ్చిమాసియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. దుబాయ్ కేంద్రంగా షోను నిర్వహించనున్నారు. వ్యాపార రంగంలో కొత్త ఆలోచనలు, పెట్టుబడుల అవకాశాలు, స్టార్టప్‌ల ఎదుగుదల వంటి అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఉండనుంది.
ఇప్పటివరకు నటుడిగా విభిన్న పాత్రలు పోషించిన మాధవన్.. ఇప్పుడు హోస్ట్‌గా ఎలా ఆకట్టుకుంటారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. త్వరలోనే ఈ షో చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు సమాచారం. మాధవన్‌కు సంబంధించిన ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అధికారికంగా మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: ఐటీ సోదాలపై రకుల్ ప్రీత్ సింగ్ ఆగ్రహం.. తనపై వస్తున్న వార్తలపై క్లారిటీ