
Alcohol Home Delivery: ఇంతకాలం మందుబాబులు మద్యం దుకాణాల్లో మందు కొనుగోలు చేయగా, ఇకపై నేరుగా ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. స్విగ్గీ, జొమాటో, ఉబెర్ ఈట్స్ లో ఫుడ్ ఆర్డర్ చేసినట్లుగా, ఇకపై మద్యాన్ని కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకుని డోర్ డెలివరీ తీసుకోవచ్చు. అయితే, ఈ దిశగా అడుగులు వేస్తుంది తెలుగు రాష్ట్రాలు కావు. పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం.
ఇంటికే మద్యం డెలివరీ చేసే దిశగా ప్రభుత్వం ప్రతిపాదనలు
మందుబాబులు ఇబ్బంది పడకుండా ఇంటికే మద్యాన్ని డెలివరీ చేసే దిశగా కేరళలో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికే మద్యాన్ని సరఫరా చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ రెడీ చేసింది. అంతేకాదు, ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా మద్యం అమ్మకాలతో ఆదాయం భారీగా పెరుగుతుందని భావిస్తోంది. అంతేకాదు, మద్యం దుకాణాల దగ్గర రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడానికి రాష్ట్ర ఆబ్కారీ చట్టంలో సవరణలు చేయాల్సి ఉంటుంది. త్వరలోనే ఆ సవరణలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో మందుబాబులు బయటకు వెళ్లకుండా నేరుగా ఇంటికే మద్యం తెప్పించుకునే అవకాశం ఉంది. కేరళ సర్కారు నిర్ణయం పట్ల మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.