West Bengal Draft Voters List Published: పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(SIR) తర్వాత ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. 58,20,898 మంది ఓటర్లు తొలగింపునకు గురయ్యారు. ఈ ఏడాది జనవరిలో 7.66 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. తాజాగా ఈసీ ప్రచురించిన ముసాయిదా జాబితాల్లో 7.08 కోట్ల మందే ఉన్నారు. తొలగించిన ఓటర్లలో మృతులు 24.16 లక్షల మంది ఉన్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. శాశ్వతంగా వలస పోయినవారు 19.88 లక్షల మంది కాగా.. ఆచూకీ లేనివారు 12.20 లక్షల మంది, ‘ఘోస్ట్’ ఓటర్ల సంఖ్య 1.83 లక్షలు. 1.38 లక్షల మంది ఓటర్లను డూప్లికేట్ ఎంట్రీలుగా గుర్తించి తీసివేశారు. ఎన్యుమరేషన్ సందర్భంగా కనుగొన్న లోపాల ఆధారంగా ఇంకో 57 వేల ఓట్లు తొలగించారు.
పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చు!
తాజాగా విడుదల చేసింది ముసాయిదా జాబితాలు మాత్రమేనని, జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ప్రాతినిధ్యం వహిస్తున్న చౌరంగీలో అత్యధికంగా 75,553 ఓట్లు తీసివేశారు. సీఎం మమత స్థానమైన భవానీపూర్‌లో 44,787 ఓట్ల తొలగించారు. మరోవైపు, రాజస్థాన్‌లోనూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ తర్వాత 41.85 లక్షల ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగించింది.
3 రాష్ట్రాలు, 2 యూటీల్లో కోటి ఓట్ల తొలగింపు
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయిన మూడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలను ప్రచురించగా.. కోటికిపైగా ఓట్లను ఈసీ తొలగించింది. ఈ ఏడాది అక్టోబరు 27నాటికి వీటిలో 13.36 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. SIR తర్వాత 12.32 కోట్ల మందికి మాత్రమే చోటు దక్కింది. తీసేసిన కోటికిపైగా ఓట్లలో సగం (58 లక్షలు) బెంగాల్లోనే ఉన్నాయి. రాజస్థాన్‌లో 42 లక్షలు, గోవాలో 1.01 లక్షలు, పుదుచ్చేరిలో 1.03 లక్షలు, లక్షదీవుల్లో 56,384 ఓట్లను తొలగించినట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.





