
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన వాణి అనే యువతి పెళ్లిని పవిత్ర బంధంగా కాకుండా మోసాలకు మార్గంగా మార్చుకుంది. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అమాయక యువకులనే లక్ష్యంగా చేసుకుని, తన అందచందాలు, మాటలతో నమ్మించి వివాహం చేసుకోవడం, ఆ తర్వాత మోసం చేయడం ఆమె ప్రధాన విధిగా మారింది. ఈ మోసాలకు ఆమె మేనత్త సహకారం కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒక్కరిద్దరిని కాదు.. ఏకంగా 8 మందిని పెళ్లాడి అందరినీ నిలువునా ముంచినట్లు సమాచారం.
వివాహం జరిగిన రోజే లేదా కొన్ని రోజుల వ్యవధిలోనే వాణి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టేది. ఇంట్లోవారు నిద్రిస్తున్న సమయంలో లేదా ఎవ్వరూ లేని సమయంలో అదును చూసుకుని నగదు, బంగారు ఆభరణాలతో పరారవ్వడం ఆమె మోసాల పద్ధతి. బాధిత కుటుంబాలు మేల్కొనే సరికి ఇంట్లో పెళ్లికూతురు కనిపించేది కాదు. ఈ తరహా ఘటనలు ఒక్కచోట మాత్రమే కాకుండా పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఒడిశాలోని బరంపురానికి చెందిన యువకుడిని వాణి వివాహం చేసుకుంది. అయితే పెళ్లి జరిగిన మొదటి రోజే విలువైన బంగారు ఆభరణాలు, నగదుతో ఆమె ఉడాయించింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ‘నిత్య పెళ్లికూతురు’ చీకటి చరిత్ర ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఆమెపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన పెరుగుతున్న వివాహ మోసాల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. పెళ్లి సంబంధాలు చూసే సమయంలో కేవలం పైపై మెరుగులు చూసి నమ్మకుండా, అవతలి వ్యక్తి నేపథ్యం, కుటుంబ వివరాలు, గత చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. వాణి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం, ఆమెను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ALSO READ: (VIDEO): ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని భారత ప్రధానిని అడిగిన పాకిస్థాన్ మహిళ.. తర్వాత ఏమైందంటే?





